సర్వర్ నిర్వహణ పనుల నేపథ్యంలో ఐజీ ప్రకటన
తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌తో పాటు ఆన్‌లైన్ సేవలు సర్వర్ నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 26 నుండి 28 వరకు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. దాదాపు ఐదేళ్ల తర్వాత సర్వర్ల ఆధునీకరణ, భద్రతా ప్రమాణాల బలోపేతం, సేవల నాణ్యత మెరుగుపరచడం కోసం ఈ ముందస్తు విరామం ప్రకటిస్తున్నట్లు శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. జూన్ 26న మొహరమ్, జూన్ 28న ఆదివారం ప్రభుత్వ సెలవులు కావడంతో, మధ్యలో ఉన్న జూన్ 27 (ఒక్క రోజు) మాత్రమే రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం కలగనుంది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండానే ఈ షెడ్యూల్ రూపొందించామని ఐజీ పేర్కొన్నారు. జూన్ 29వ తేదీ నుండి అన్ని సేవలు యథావిధిగా పునఃప్రారంభం అవుతాయని, కాబట్టి ప్రజలు తమ రిజిస్ట్రేషన్ సంబంధిత పనులను ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలని ఆయన కోరారు.










