Home National_news పీఎఫ్ పరిమితి పెంపు కోట్లాది ఉద్యోగులకు ఊరట

పీఎఫ్ పరిమితి పెంపు కోట్లాది ఉద్యోగులకు ఊరట

రూ.15 వేల నుంచి రూ.25 వేలకు.

ఉద్యోగుల భవిష్య నిధి విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్‌వో తప్పనిసరి పరిధిలోని వేతన పరిమితిని నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచింది. దీంతో రూ.15 వేల నుంచి రూ.25 వేల మధ్య వేతనం పొందుతున్న ఉద్యోగులు ఇకపై తప్పనిసరి పీఎఫ్ పరిధిలోకి రానున్నారు. ఈ నిర్ణయంతో అదనంగా 50 లక్షల నుంచి కోటి మంది ఉద్యోగులకు సామాజిక భద్రత ప్రయోజనాలు అందే అవకాశం ఉందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. కేంద్రం తాజా నిర్ణయానికి ప్రధానమంత్రి ఆమోదం లభించినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ పథకానికి ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.11,339 కోట్ల అదనపు వ్యయం పడుతుందని తెలిపారు.

12 ఏళ్ల తర్వాత మరోసారి పెంపు

ఈపీఎఫ్‌వో వేతన పరిమితి 2004 నుంచి 2014 వరకు ఎలాంటి మార్పు లేకుండా కొనసాగింది. 2014 సెప్టెంబర్‌లో దానిని రూ.15 వేలకు పెంచారు. గత 12 ఏళ్లలో వేతనాలు, కనీస వేతనాలు, జీవన వ్యయం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు పరిమితిని రూ.25 వేలకు పెంచినట్లు కేంద్రం తెలిపింది. ప్రస్తుతం వేతన ఉద్యోగి సగటు ఆదాయం సుమారు రూ.23 వేల వరకు చేరినట్లు ప్రభుత్వ గణాంకాలు సూచిస్తున్నాయి. ఉదాహరణకు గతంలో నెలకు రూ.16 వేల వేతనం పొందే కొత్త ఉద్యోగి రూ.15 వేల పరిమితిని దాటడంతో తప్పనిసరి ఈపీఎఫ్‌ పరిధిలోకి రాకపోవచ్చు. కొత్త పరిమితి అమల్లోకి వచ్చిన తర్వాత అదే రూ.16 వేల వేతనంతో ఉన్న ఉద్యోగి తప్పనిసరి పీఎఫ్‌ కవరేజీలోకి వస్తారు. ప్రస్తుతం ఈపీఎఫ్‌వోలో 7.98 కోట్ల మంది సభ్యులు, 7.68 లక్షల సంస్థలు ఉన్నాయని కేంద్రం వెల్లడించింది.

యజమానులపై అదనపు బాధ్యతలు

పీఎఫ్‌ పరిమితి పెంపుతో ఉద్యోగులకు సామాజిక భద్రత విస్తరించనుండగా సంస్థలపై అదనపు బాధ్యతలు కూడా పెరగనున్నాయి. న్యాయ నిపుణురాలు దేబ్జానీ ఐచ్ ప్రకారం, రూ.25 వేల వరకు ప్రాథమిక వేతనం పొందే ఉద్యోగుల సంఖ్య పెరగడంతో యజమానులు వారి తరఫున 12 శాతం ఈపీఎఫ్‌ వాటా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పు ఉద్యోగుల పెన్షన్ పథకం (ఈపీఎస్‌), డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకం (ఈడీఎల్‌ఐ)పై కూడా ప్రభావం చూపనుంది. కొత్త పరిమితికి అనుగుణంగా హెచ్‌ఆర్‌, పేరోల్ వ్యవస్థలు, ఉద్యోగుల రికార్డులు, పీఎఫ్‌ దాఖలు ప్రక్రియలను సంస్థలు వేగంగా మార్చుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా కేంద్ర నిర్ణయం తక్కువ వేతనాల పరిధిలో ఉన్న మరింత మంది ఉద్యోగులను దీర్ఘకాలిక పొదుపు, పెన్షన్, సామాజిక భద్రత వ్యవస్థలోకి తీసుకురానుంది.

 

#EPF #EPFO #PF #PFLimit #EPFWageCeiling #EPFO2026 #ProvidentFund #EmployeeBenefits #SocialSecurity #EPS #EDLI #LabourMinistry #PFContribution #EmployeeSavings