Home Celebrity సూర్య–జ్యోతిక బంగ్లా లగ్జరీ లుక్ రూ.200 కోట్ల ఇంటి విశేషాలు

సూర్య–జ్యోతిక బంగ్లా లగ్జరీ లుక్ రూ.200 కోట్ల ఇంటి విశేషాలు

తమిళ సినీ తారలు సూర్య, జ్యోతిక 20వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మరోసారి పెళ్లి ప్రమాణాలు చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పిల్లలు దియా, దేవ్ సమక్షంలో జరిగిన ఈ ప్రత్యేక వేడుక అభిమానులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా చెన్నైలోని వారి విలాసవంతమైన బంగ్లా మరోసారి చర్చలోకి వచ్చింది. మహాలింగపురంలోని విజయలక్ష్మి స్ట్రీట్‌లో, టీ.నగర్ సమీపంలో ఉన్న ఈ ఇల్లు సుమారు రూ.200 కోట్ల విలువ కలిగినదిగా టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. కొన్నేళ్ల పాటు పిల్లలతో కలిసి ఈ బహుళ అంతస్తుల భవనంలోనే నివసించిన ఈ జంట.. కరోనా సమయంలో ముంబైకి మారినట్లు సమాచారం.

మార్బుల్‌ ఫ్లోర్లు.. పర్షియన్‌ కార్పెట్లు

బంగ్లా అంతా చెక్క పనితనంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. మార్బుల్‌, వుడ్‌ ఫ్లోరింగ్‌, పర్షియన్‌ రగ్గులు, ఖరీదైన సోఫాలు, ఆకట్టుకునే ఛాండ్లియర్లు ఇంటి అందాన్ని మరింత పెంచుతున్నాయి. టీవీ ఎదురుగా సింపుల్‌గా అమర్చిన సోఫాలతో ప్రత్యేక ఎంటర్‌టైన్‌మెంట్ రూమ్ ఉంది. మరో లివింగ్ ఏరియాలో తెల్లటి రగ్గు, ఎదురెదురుగా ఏర్పాటు చేసిన సోఫాలు, ఫైర్‌ప్లేస్‌, చెక్క బీమ్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇంటి నిర్మాణంలో సహజ గాలి, వెలుతురుకు ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో పగటివేళ సూర్యకాంతి ఇంటిలోని ప్రతి మూలకు చేరేలా డిజైన్ చేశారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో హాయిగా గడిపేందుకు ప్రత్యేక దివాన్ రూమ్ కూడా ఉంది.

గ్లామ్ రూమ్‌.. పచ్చని తోట

ఈ ఇంటిలో మరో ప్రత్యేక ఆకర్షణ గ్లామ్ రూమ్‌. చుట్టూ వార్డ్రోబులు, పెద్ద అద్దాలు, నగలు, ఇతర యాక్సెసరీలను భద్రపరచుకునేందుకు ప్రత్యేక స్థలం ఇందులో ఉంది. లగ్జరీ హోటల్ సూట్‌ను తలపించేలా గదుల ఇంటీరియర్‌ను రూపొందించారు. ఇంటి బయట విశాలమైన పచ్చని తోట ఆకట్టుకుంటుంది. చక్కగా నిర్వహించే పచ్చిక బయలు, పూల చెట్లు, సువాసనిచ్చే మూలికలతో నగర రద్దీకి దూరంగా ప్రశాంత వాతావరణాన్ని అందించేలా ఈ గార్డెన్‌ను తీర్చిదిద్దారు. మొత్తంగా సూర్య–జ్యోతిక బంగ్లా ఆర్భాటానికి దూరంగా, సహజత్వాన్ని కలిపిన విలాసవంతమైన జీవనశైలికి అద్దం పడుతోంది.

 

 

#Suriya #Jyothika #SuriyaJyothika #SuriyaHouse #JyothikaHouse #LuxuryHome #CelebrityHome #Chennai #LuxuryBungalow #CelebrityLifestyle #TamilCinema #Kollywood