Home AP టెట్‌ ఫలితాలు ప్రకటించిన లోకేశ్‌

టెట్‌ ఫలితాలు ప్రకటించిన లోకేశ్‌

45.63%, సర్వీస్‌ టీచర్లలో 50.93% పాస్ .

ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీటెట్‌-జూన్‌ 2026 ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆదివారం విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 12 రోజుల పాటు ఆగస్టు 5 నుంచి 16 వరకు కంప్యూటర్‌ ఆధారిత విధానంలో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 2,14,486 మంది అభ్యర్థులు 2,38,252 పేపర్లకు నమోదు చేసుకోగా, 1,97,703 మంది 2,18,254 పేపర్లకు హాజరయ్యారు. పరీక్ష అనంతరం ప్రాథమిక కీ విడుదల చేసి అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. నిపుణుల కమిటీ వాటిని పరిశీలించి అవసరమైన మార్పులు చేసింది. తుది కీ ఆధారంగా ఫలితాలను రూపొందించారు. పాఠశాల విద్యాశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం 90,862 మంది అభ్యర్థులు 99,591 పేపర్లలో ఉత్తీర్ణత సాధించారు. దీంతో మొత్తం ఉత్తీర్ణత శాతం 45.63గా నమోదైంది. అభ్యర్థులు తమ వివరాలతో అధికారిక ఏపీటెట్‌ వెబ్‌సైట్లలో ఫలితాలను పరిశీలించవచ్చు.

సర్వీస్‌ టీచర్లలో మెరుగైన ఫలితాలు

ఇప్పటికే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న సర్వీస్‌ టీచర్లు ఏపీటెట్‌లో మెరుగైన ఉత్తీర్ణత శాతం నమోదు చేశారు. ఈ విభాగంలో 74,711 మంది 84,798 పేపర్లకు నమోదు చేసుకోగా, 72,288 మంది 81,127 పేపర్లకు పరీక్ష రాశారు. వీరిలో 37,789 మంది 41,315 పేపర్లలో ఉత్తీర్ణత సాధించారు. దీంతో సర్వీస్‌ టీచర్ల ఉత్తీర్ణత శాతం 50.93గా నమోదైంది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లతో పాటు 9552300009 వాట్సాప్‌ నంబర్‌ ద్వారా కూడా తెలుసుకునే అవకాశం కల్పించారు. పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులందరికీ మంత్రి నారా లోకేశ్‌ అభినందనలు తెలిపారు. ముఖ్యంగా సర్వీస్‌ టీచర్ల మెరుగైన ఫలితాలను ప్రశంసించారు. వారి అకడమిక్‌ ప్రతిభ, అంకితభావానికి ఈ ఫలితాలు నిదర్శనమని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల కృషి, నిబద్ధత ఆంధ్రప్రదేశ్‌ విద్యా రంగ భవిష్యత్తును మరింత బలోపేతం చేస్తాయని లోకేశ్‌ అన్నారు.

 

#APTET #APTET2026 #APTETResults #APTETJune2026 #NaraLokesh #Lokesh #AndhraPradesh #APEducation #TeacherEligibilityTest #TeacherJobs #APTETResult #APTETPassPercentage #ServiceTeachers #TeacherNews #APTeachers #EducationNews #AndhraPradeshNews