ఎప్పుడు ఎన్నికలొచ్చినా సిద్ధంగా ఉండాలి.
ఎన్నికల్లో గట్టిగా పోరాడాలన్న వైఎస్ జగన్ .
స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడు, ఎలా జరిగినా పార్టీ శ్రేణులు గట్టిగా నిలబడి పోరాడాలని పిలుపునిచ్చారు. బుధవారం పర్చూరు నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలతో తాడేపల్లిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఎన్నికలు జరుగుతాయో లేదో కూడా స్పష్టత లేని పరిస్థితి ఉందని అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని జగన్ వ్యాఖ్యానించారు. జరిగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో.. స్థానిక ఎన్నికల్లో జరిగే అధికార దుర్వినియోగం, పోలీసు బలగాల ప్రయోగం జరిగే అవకాశముందన్నారు జగన్. రిజర్వేషన్లకు న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాటిని సాకుగా చూపి ఎన్నికలను వాయిదా వేసే పరిస్థితి తీసుకురావద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఓటర్ల జాబితాపైనా అనుమానాలు
ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియపైనా జగన్ ప్రశ్నలు లేవనెత్తారు. ఓట్ల తొలగింపుపై వస్తున్న ఆరోపణలు ఎన్నికల నిర్వహణపై అనుమానాలు కలిగిస్తున్నాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు నిజంగా స్వేచ్ఛగా, పారదర్శకంగా జరుగుతాయా అని ప్రశ్నించారు. అధికార పార్టీ మాత్రం వైఎస్సార్‌సీపీ ఆరోపణలను ఖండించింది. ఎన్నికలు సాఫీగా జరిగితే వైఎస్సార్‌సీపీ విజయం సాధిస్తుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు. సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యుల ఎన్నికల్లో పోటీ చేసే కార్యకర్తలకు పార్టీ పూర్తి అండగా నిలవాలని సూచించారు. స్థానిక ఎన్నికలు పార్టీ క్షేత్రస్థాయి బలాన్ని పరీక్షించే కీలక అవకాశం అని అభివర్ణించారు. గ్రామస్థాయిలో ప్రజలకు కార్యకర్తలే అందుబాటులో ఉంటారని, వారి బలాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
కూటమి పాలనపై జగన్ విమర్శలు
అధికార దుర్వినియోగం, పోలీసు ఒత్తిడి, అక్రమ కేసులు, అరెస్టులు, ప్రలోభాలతో రాజకీయ ప్రత్యర్థులను బలహీనపర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని జగన్ ఆరోపించారు. “రోజుకో డ్రామా.. రోజుకో నటన.. డైవర్షన్ పాలిటిక్స్” అంటూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గతంలో తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రస్తావిస్తూ 99 శాతం మేనిఫెస్టో హామీలు నెరవేర్చామని చెప్పారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ, నాడు–నేడు, ఆరోగ్యశ్రీ, వైద్య కళాశాలలు, రైతు భరోసా కేంద్రాలు వంటి కార్యక్రమాలను ఆయన గుర్తుచేశారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన సంక్షేమ హామీల్లో చాలా వరకు అమలు కాలేదని ఆరోపించారు. 2017 నంద్యాల ఉపఎన్నిక, 2019 అసెంబ్లీ ఎన్నికలను ప్రస్తావిస్తూ అధికార యంత్రాంగం, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా క్షేత్రస్థాయి ప్రజాభిమానం కీలకమవుతుందని అన్నారు. స్థానిక ఎన్నికలను వైఎస్సార్‌సీపీ బలాన్ని చాటుకునే అవకాశంగా మార్చుకోవాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు.
#YSJagan #JaganMohanReddy #YSRCP #LocalBodyElections #APLocalElections #YSRCPStrategy #JaganElectionStrategy #KurukshetraBattle #YSRCP2026 #YSRCPCadre #APPolitics #AndhraPradeshPolitics #BCReservations #34PercentBCReservation #VoterListRevision #VoterDeletion #LocalElectionsAP #JaganTadepalliMeeting #CoalitionGovernment #ChandrababuNaidu #PoliticalBattle #GrassrootsPolitics #YSRCPNews











