మహిళల ఆసియా కప్‌లో పాకిస్థాన్‌కు వరుసగా క్రమశిక్షణా షాక్‌లు తగులుతున్నాయి. కెప్టెన్ ఫాతిమా సనా తర్వాత ఇప్పుడు పాకిస్థాన్ బ్యాటర్ గుల్ ఫిరోజాపై ఐసీసీ చర్యలు తీసుకుంది. హాంకాంగ్‌తో సోమవారం దుబాయ్‌లో జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆమెకు మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా, ఒక డీమెరిట్ పాయింట్ విధించారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.8 కింద ఆమె తప్పిదం నమోదైంది. అంతర్జాతీయ మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయంపై అసమ్మతి వ్యక్తం చేయడం ఈ నిబంధన పరిధిలోకి వస్తుంది. పాకిస్థాన్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో ఎల్బీడబ్ల్యూగా ఔటైన ఫిరోజా.. నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బంతిని బ్యాట్‌కు తాకించానని సూచించేలా బ్యాట్ వైపు చేతితో సంకేతం చేశారు. దీంతో అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్లుగా ఐసీసీ పరిగణించింది. గత 24 నెలల్లో ఫిరోజాకు ఇది రెండో క్రమశిక్షణా తప్పిదం కావడంతో ఆమె ఖాతాలో డీమెరిట్ పాయింట్లు రెండుకు చేరాయి. ఈ కేసులో ఫిరోజా తన తప్పిదాన్ని అంగీకరించారు. ఐసీసీ అంతర్జాతీయ మ్యాచ్ రిఫరీల ప్యానెల్‌కు చెందిన సుప్రియా రాణి దాస్ ప్రతిపాదించిన శిక్షను ఆమె అంగీకరించడంతో ప్రత్యేక విచారణ అవసరం లేకుండానే కేసు ముగిసింది. ఈ అభియోగాన్ని ఫీల్డ్ అంపైర్లు రబాబ్ అహ్సన్, రోకేయా సుల్తానా, థర్డ్ అంపైర్ శివానీ మిశ్రా, ఫోర్త్ అంపైర్ షతీరా జకీర్ నమోదు చేశారు. లెవల్-1 నిబంధనల ఉల్లంఘనకు అధికారిక మందలింపు నుంచి మ్యాచ్ ఫీజులో 50 శాతం వరకు జరిమానా, ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్ల వరకు శిక్ష విధించే అవకాశం ఉంది. ఐసీసీ క్రమశిక్షణా విధానం ప్రకారం 24 నెలల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు వస్తే అవి సస్పెన్షన్ పాయింట్లుగా మారతాయి.
#GulFiroza #GulFirozaPenalty #GulFirozaFined #GulFirozaDemeritPoint #ICC #ICCPenalty #ICCCodeOfConduct #PakistanWomen #PakistanCricket #WomensAsiaCup #GulFirozaPakistan #DemeritPoint #CricketDiscipline #UmpireDecision #Dissent #HongKongVsPakistan #PakistanWomenCricket #CricketNews #WomensCricket #ICCAction











