Home Inter National News ఇటలీలో కొత్త చరిత్ర! 1,413 రోజుల పాలనతో మెలోనీ రికార్డు

ఇటలీలో కొత్త చరిత్ర! 1,413 రోజుల పాలనతో మెలోనీ రికార్డు

సంక్షోభాలను దాటిన రైట్ వింగ్ సర్కార్ .

ఇటలీ రాజకీయ చరిత్రలో జార్జియా మెలోనీ ప్రభుత్వం కొత్త రికార్డు సృష్టించింది. 2022లో అధికారంలోకి వచ్చిన మెలోనీ.. ఇటలీ యుద్ధానంతర చరిత్రలో అత్యంత ఎక్కువ కాలం కొనసాగిన ప్రభుత్వానికి నాయకురాలిగా నిలిచారు. శుక్రవారం సెప్టెంబర్‌ 4న దక్షిణ ఇటలీలోని బారీ నగరంలో భారీ సభతో ఈ రికార్డును జరుపుకున్నారు. మెలోనీ ప్రభుత్వం 1,413 రోజులు పూర్తిచేసుకుని మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ రికార్డును అధిగమించింది. గత 80 ఏళ్లలో ఇటలీలో ఏకంగా 68 ప్రభుత్వాలు మారాయి. సంక్షోభాలు, మిత్రపక్షాల నుంచి నేతల వైదొలగడం వంటి కారణాలతో ప్రభుత్వాలు కూలిపోవడం అక్కడ సాధారణమే. కానీ మెలోనీ ఇప్పటివరకు తన సంకీర్ణాన్ని నిలబెట్టుకోవడంలో సఫలమయ్యారు.

ఉద్యోగాలు పెరిగాయన్న మెలోనీ.. విమర్శలు మాత్రం
మెలోనీ నేతృత్వంలోని బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ పార్టీ.. లీగ్‌, ఫోర్జా ఇటాలియా పార్టీలతో కలిసి ప్రభుత్వం నడుపుతోంది. దాదాపు నాలుగేళ్ల పాలనలో 10 లక్షలకు పైగా అదనపు ఉద్యోగాలు, వ్యక్తిగత ఆదాయపన్నులో 21 బిలియన్‌ యూరోల తగ్గింపు వంటి విజయాలను ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. దేశ ఆర్థిక స్థిరత్వం మెరుగుపడిందని మెలోనీ చెబుతున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఆర్థిక స్థిరత్వం ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురాలేదని విమర్శిస్తున్నాయి. వేతనాలు పెరగలేదని, పెట్రోల్‌ ధరలు పెరిగాయని, ఉద్యోగ భద్రత తగ్గిందని, ఆరోగ్య వ్యవస్థ పనితీరు బలహీనపడిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.

వలసలపై కఠిన వైఖరి.. 2027పై కన్ను
మెలోనీ ప్రభుత్వం భద్రత, అక్రమ వలసల అంశాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. ఇప్పటివరకు సుమారు 300 చట్టాలు, డిక్రీలు తీసుకురాగా.. వాటిలో ఎక్కువ భాగం భద్రతకు సంబంధించినవేనని ప్రభుత్వం చెబుతోంది. అక్రమ వలసలను అడ్డుకుంటామని ఇచ్చిన హామీతో 2022లో అధికారంలోకి వచ్చిన మెలోనీ.. తమ విధానాలతో వలసదారుల రాక 80 శాతం తగ్గిందని పేర్కొంటున్నారు. మరోవైపు ఆమెపై విమర్శలు కూడా తీవ్రంగానే ఉన్నాయి. ప్రభుత్వం పోలీసు వ్యవస్థను కఠినతరం చేస్తోందని, వలసదారులపై వ్యతిరేక వాతావరణాన్ని పెంచుతోందని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. 2027 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బారీ సభను మెలోనీ ఎన్నికల ప్రచారానికి వేదికగా కూడా ఉపయోగించుకున్నారు. అయితే ఆమెకు కుడిపక్షంలోనే మరింత తీవ్ర వైఖరితో ఎదుగుతున్న మాజీ సైనికాధికారి నేతృత్వంలోని కొత్త పార్టీ నుంచి సవాలు ఎదురవుతోంది.

 

#GiorgiaMeloni #Italy #ItalyPolitics #MeloniGovernment #SilvioBerlusconi #BrothersOfItaly #RightWing #ItalianPolitics #1413Days #ItalyGovernment #ImmigrationPolicy #PoliticalRecord #ItalyElections #EuropeanPolitics #WorldNews