రిస్క్‌కు రేవంత్ రెఢీనా!?
కొండా ఫ్యామిలీ సవాల్
భట్టి- కొండా మురళీ భేటీలో కీలకాంశాలు
కొండా సురేఖ కొత్త స్కెచ్
రేవంత్ కు ఝలక్ ఇస్తానంటూ భట్టికి సందేశం
సస్పెండ్ చేస్తే ఎమ్మెల్యే పదవికీ రాజీనామా
ఎలక్షన్‌లో అమీతుమీ తేల్చుకుంటా
జిల్లా మొత్తం రేవంత్ వ్యతిరేకంగా వేవ్ క్రియేట్ చేస్తా
కొండా సురేఖ ప్రతిజ్ఞ
తెలంగాణ కాంగ్రెస్ లో కొండా ఫ్యామిలీ పంచాయితి రోజుకో మలుపు తిరుగుతోంది. మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందన్న ప్రచారం నేపథ్యంలో ఆమె భర్త కొండా మురళీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ భేటీలో సురేఖపై వస్తున్న ఆరోపణలు, పార్టీలో నెలకొన్న విభేదాలు, రేవంత్ రెడ్డితో వివాదం వంటి అంశాలపై కీలకంగా చర్చ జరిగినట్టు సమాచారం.. అదే సమయంలో కొండా కుటుంబం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్న సంకేతాలు పంపినట్లు వార్తలు వస్తున్నాయి.
సస్పెన్షన్ అయితే రాజీనామా
సురేఖను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి రాజకీయంగా అమీతుమీకి సిద్ధమవుతామనే సందేశాన్ని భట్టికి మురళి చేరవేసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రేవంత్ ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చేలా భవిష్యత్ రాజకీయ వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నట్టు కొండా కుటుంబం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఉపఎన్నిక వచ్చినప్పుడు ఎవరి బలం ఎంతో తేల్చుకుంటానని, తన నియోజకవర్గంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రేవంత్ వ్యతిరేక వేవ్ సృష్టిస్తాననే స్థాయిలో సురేఖ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఈ వ్యవహారం వ్యక్తిగత విభేదాలను దాటి రాజకీయ సవాల్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రేవంత్‌కు కొత్త రిస్క్
కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయంగా సున్నితమైన పరీక్షగా మారవచ్చని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. చర్యలు తీసుకుంటే కొండా కుటుంబం తిరుగుబాటు స్వరం మరింత పెంచే అవకాశం ఉండగా, చర్యలు తీసుకోకుండా వదిలేస్తే పార్టీ క్రమశిక్షణపై ప్రశ్నలు తలెత్తే పరిస్థితి ఉంది. ఈ మొత్తం వ్యవహారం రేవంత్ రెడ్డి ఇజ్జత్‌కు సవాల్‌గా మారింది. దీంతో ఎలాంటి రిస్క్ కైనా రెడీ అంటూ రేవంత్ కొండా సురేఖపై వేటుకే మొగ్గు చూపుతున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. చివరకు ఈ వివాదంలో కొండెక్కేదెవరో చూడాలి.











