Home AP అడవికి టెక్నాలజీ కవచం! కర్ణాటక తరహాలో అటవీ నిఘా వ్యవస్థ

అడవికి టెక్నాలజీ కవచం! కర్ణాటక తరహాలో అటవీ నిఘా వ్యవస్థ


ప్రతి అంగుళంపై డిజిటల్‌ నిఘా.
ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్.

ఆంధ్రప్రదేశ్‌లో అటవీ పరిరక్షణకు అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఆదేశించారు. కర్ణాటక అటవీ శాఖ తరహాలో ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి అడవిలో ప్రతి అంగుళాన్ని కేంద్రం నుంచే పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అటవీ మ్యాపింగ్‌తో పాటు వన్యప్రాణుల కదలికలు, అటవీ కార్యకలాపాలు, గస్తీ, వాహనాల రాకపోకలపై డిజిటల్‌ నిఘా ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల రాష్ట్ర అటవీశాఖ ఐటీ సలహాదారు పెన్నమరెడ్డి నాగబాబు ఆధ్వర్యంలోని బృందం కర్ణాటకలో మూడు రోజుల పాటు పర్యటించి అక్కడ అమలవుతున్న ఐటీ, జీఐఎస్‌, మొబైల్‌ అప్లికేషన్లు, కమాండ్‌ సెంటర్‌ విధానాలను అధ్యయనం చేసింది. ఆ నివేదికను పరిశీలించిన పవన్‌ కళ్యాణ్‌ విజయవంతమైన విధానాలను ఏపీలో అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

డ్రోన్లు, కెమెరాలతో వన్యప్రాణుల ట్రాకింగ్‌

కొత్త కమాండ్‌ సెంటర్‌ ద్వారా అనేక వ్యవస్థలను ఒకే చోట నుంచి పర్యవేక్షించే అవకాశం కలగనుంది. జియోస్పేషియల్‌ డ్యాష్‌బోర్డులు, డ్రోన్‌ ఆధారిత నిఘా, కెమెరా ట్రాప్‌ల ద్వారా వన్యప్రాణుల సంఖ్య, కదలికల విశ్లేషణ చేపట్టనున్నారు. అటవీ మార్గాల్లో ప్రయాణించే వాహనాల ట్రాకింగ్‌, గస్తీ బృందాల పర్యవేక్షణ, అటవీ అగ్నిప్రమాదాల గుర్తింపు, మానవ–వన్యప్రాణి ఘర్షణలపై నిరంతర నిఘా పెట్టనున్నారు. అటవీ సరిహద్దుల డిజిటలైజేషన్‌ ప్రక్రియ ఇప్పటికే రాష్ట్రంలో కొనసాగుతోందని పవన్‌ తెలిపారు. కేంద్ర మార్గదర్శకత్వంలో చేపడుతున్న ఈ ప్రక్రియతో అటవీ భూముల సరిహద్దులకు చట్టబద్ధమైన రక్షణ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. మానవ–వన్యప్రాణి ఘర్షణల నివారణకు ఏఐ ఆధారిత ప్రమాద అంచనా వ్యవస్థలు, వన్యప్రాణుల సంచార డ్యాష్‌బోర్డులు కూడా సిద్ధం చేసినట్లు వివరించారు.

కర్ణాటకతో టెక్నాలజీ భాగస్వామ్యం

అటవీ పరిరక్షణలో కర్ణాటక అనుభవాన్ని మరింతగా ఉపయోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధం వంటి అంశాల్లో ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందాలు ఉన్నాయని పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. ఇకపై సాంకేతిక పరిజ్ఞానం మార్పిడికి ప్రత్యేకంగా సంయుక్త వర్క్‌షాప్‌లు నిర్వహించనున్నారు. పత్రాల మార్పిడి, అవసరమైన చోట సోర్స్‌కోడ్‌ భాగస్వామ్యం, జీఐఎస్‌లో ఉత్తమ విధానాల మార్పిడి, ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ వ్యవస్థలపై శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. అటవీ సంరక్షణలో ఆధునిక సాంకేతికతను పూర్తిస్థాయిలో ఉపయోగించి జవాబుదారీతనం పెంచడం ఈ చర్యల ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తోంది.

 

#PawanKalyan #AndhraPradesh #APForestDepartment #ForestProtection #ForestSurveillance #DigitalSurveillance #KarnatakaForestModel #CommandAndControlCenter #WildlifeTracking #DroneSurveillance #AIinForestry #GIS #ForestConservation #WildlifeProtection #HumanWildlifeConflict #RedSanders