Home Telangana సర్దార్ పాపన్న స్ఫూర్తితో సామాజిక న్యాయం

సర్దార్ పాపన్న స్ఫూర్తితో సామాజిక న్యాయం


గీత కార్మికులకు అండగా ఉన్నామన్న సీఎం

గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అర్హత ఉన్న నేత, గీత కార్మికులు ఎంతమంది ఉన్నా అందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు అందించాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. గౌడ సోదరులకు ఇప్పటికే 50 వేల కాటమయ్య కిట్లు పంపిణీ చేశామని, ప్రమాదవశాత్తు గీత కార్మికులు మరణిస్తే ₹5 లక్షల పరిహారం అందిస్తున్నామని చెప్పారు. గీత వృత్తికి భవిష్యత్తు కల్పించేందుకు నీటిపారుదల ప్రాజెక్టుల కాలువల గట్లపై ఈత, తాటి చెట్లు పెంచేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆదేశించారు.

సర్దార్ పాపన్నకు ఘన నివాళి

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీక అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పాపన్న ఒక కులానికి, కుటుంబానికి పరిమితమైన వ్యక్తి కాదని, బహుజనుల నుంచి పుట్టుకొచ్చిన వీరుడని పేర్కొన్నారు. గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన ఆయన పోరాట స్ఫూర్తి తెలంగాణ తరతరాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. పాపన్న విగ్రహం కోసం ట్యాంక్‌బండ్ వద్ద పర్యాటక శాఖ కార్యాలయాన్ని మరోచోటికి తరలించి స్థలం కేటాయించినట్లు చెప్పారు. హైదరాబాద్‌కు వచ్చే పర్యాటకులు, గణేష్ నిమజ్జన సమయంలో ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్లే ప్రతి ఒక్కరికీ పాపన్న స్ఫూర్తి కనిపించేలా ఆ ప్రాంతాన్ని ఎంపిక చేశామని వివరించారు. మహారాష్ట్రలో శివాజీ మహారాజ్‌కు మరాఠీలు ఇచ్చే గౌరవం తెలంగాణలో పాపన్నకు దక్కాలని సీఎం ఆకాంక్షించారు.

చదువుతోనే పిల్లల తలరాత మార్పు

కులవృత్తులను కొనసాగిస్తూ గౌరవించుకోవాలని, అయితే పిల్లలను మాత్రం తప్పనిసరిగా చదివించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బలహీన వర్గాల పిల్లలు డాక్టర్లు, న్యాయవాదులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కావాలని, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల కోసం ఎన్ని నిధులైనా కేటాయిస్తామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియ్యంతో భోజనం, నాణ్యమైన అల్పాహారం, పాలు, రాగిజావ అందిస్తున్నామని తెలిపారు. ఏటీసీల్లో చేరే విద్యార్థులకు నెలకు ₹2 వేల ఉపకార వేతనం అందిస్తున్నామని వెల్లడించారు. బీసీ కులగణన, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ ద్వారా సామాజిక న్యాయానికి ప్రభుత్వం బాటలు వేసిందని చెప్పారు. “ఇది నా ప్రభుత్వం కాదు.. మన ప్రభుత్వం” అంటూ ప్రజల సంక్షేమం, సామాజిక న్యాయం, సమాన అవకాశాలే లక్ష్యంగా పాలన సాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

 

 

#SardarPapanna #SardarSarvaiPapanna #RevanthReddy #TelanganaCM #GeethaWorkers #ToddyTappers #KaatamaiahKits #SocialJustice #BCWelfare #TelanganaGovernment #PapannaGoud #TelanganaNews #GoudCommunity #TelanganaDevelopment #BCCasteCensus #SocialJusticeTelangana #TelanganaPolitics