Home AP వికసిత్ భారత్‌ దిశగా అడుగులు ప్రపంచ నాయకత్వమే భారత్‌ లక్ష్యం

వికసిత్ భారత్‌ దిశగా అడుగులు ప్రపంచ నాయకత్వమే భారత్‌ లక్ష్యం


స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం.

కాకినాడ పోలీస్‌ పరేడ్‌ మైదానంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ఆయన మాట్లాడుతూ భారత్‌ బలమైన, సమర్థ దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా అడుగులు వేస్తోందని అన్నారు. ఒక తరం స్వాతంత్ర్యం కోసం పోరాడితే.. మరో తరం ఆ స్వాతంత్ర్యాన్ని కాపాడిందని గుర్తుచేశారు. వికసిత్‌ భారత్‌ సంకల్పంలో ఆంధ్రప్రదేశ్‌ కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఈ వేడుకల్లో అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

హస్తకళలకు వుడ్‌ బ్యాంకుల బలం

హస్తకళల పరిరక్షణకు పవన్‌ కల్యాణ్‌ కీలక చర్యలు చేపట్టారు. రాజమహేంద్రవరం ధవళేశ్వరంలో సెంట్రల్‌ క్రాఫ్ట్‌ వుడ్‌ బ్యాంకును ప్రారంభించిన ఆయన.. రాష్ట్రంలోని ఆరు ప్రధాన క్లస్టర్లలో ఏర్పాటు చేసిన వుడ్‌ బ్యాంకులను వర్చువల్‌గా ప్రారంభించారు. వీటి ద్వారా దాదాపు 5 వేల హస్తకళాకారుల కుటుంబాలకు కలప కొరత తీరనుంది. రాజమహేంద్రవరం వుడ్‌ బ్యాంకులో ప్రస్తుతం 30 క్యూబిక్‌ మీటర్ల కలప అందుబాటులో ఉంచారు. వచ్చే ఐదేళ్లకు సరిపడా కలపను సిద్ధం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, బొబ్బిలి వీణలు, ఇతర సంప్రదాయ కళాకృతుల తయారీకి ఈ బ్యాంకులు ఉపయోగపడనున్నాయి.

కళాకారులతో పవన్‌ ముచ్చట

వుడ్‌ బ్యాంక్‌లో ఏర్పాటు చేసిన హస్తకళా ప్రదర్శనను పవన్‌ కల్యాణ్‌ తన సతీమణి అన్నా కొణిదెలతో కలిసి తిలకించారు. కళాకృతుల తయారీ విధానం, కళాకారుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రతి కళాకృతిపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి కళాకారుడి వివరాలు, తయారీ విధానాన్ని పరిశీలించారు. కలప దుంగలపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ల ద్వారా వాటి సేకరణ ప్రాంతం, చెట్టు వయస్సు, శాస్త్రీయ నామం వంటి వివరాలను తెలుసుకున్నారు. అగ్గిపెట్టెలో పట్టేంత చిన్న కళాకృతిని చూసి పవన్‌ దంపతులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పలు కళాకృతులను కొనుగోలు చేసి కళాకారులను ప్రోత్సహించారు. సంప్రదాయ హస్తకళలకు ముడిసరుకు భరోసా కల్పించడంతో పాటు కళాకారుల జీవనోపాధిని బలోపేతం చేయడమే వుడ్‌ బ్యాంకుల ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

 

#PawanKalyan, #ViksitBharat, #AndhraPradesh, #IndependenceDay2026, #APDevelopment, #Kakinada, #PawanKalyanSpeech, #CraftWoodBanks, #WoodBanks, #ArtisanWelfare, #Handicrafts, #APHandicrafts, #EtikoppakaToys, #KondapalliToys, #BobbiliVeena, #Rajahmundry, #TraditionalArtisans, #ArtisanLivelihood, #APNews, #AndhraPradeshGovernment