Home General ఆఫర్‌ ఉంది.. ఉద్యోగం ఎప్పుడు?

ఆఫర్‌ ఉంది.. ఉద్యోగం ఎప్పుడు?


విప్రో ఆన్‌బోర్డింగ్‌ ఆలస్యంపై ఫిర్యాదులు.
200 మందికి పైగా యువత ఎదురుచూపు.

ఐటీ దిగ్గజం విప్రోలో ఉద్యోగం కోసం ఎంపికైన 200 మందికి పైగా విద్యార్థులు, యువ ఇంజనీర్లు నెలల తరబడి ఎదురుచూస్తున్నారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. విప్రో ఎలైట్‌ హైరింగ్‌ 2025 ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులకు ఇప్పటికీ స్పష్టమైన జాయినింగ్‌ తేదీ ఇవ్వలేదని ముంబైకి చెందిన నాసెంట్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎంప్లాయీస్‌ సెనేట్‌ (నైట్స్) ఆరోపించింది. ఈ అంశంపై కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయకు సంస్థ లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది. అభ్యర్థులు 2025 ఫిబ్రవరి 1న క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొని, అదే నెలలో తదుపరి దశలను పూర్తి చేశారని నైట్స్ తెలిపింది. జూలై 22, 2025న ఆఫర్‌ లెటర్లు, ఆగస్టులో లెటర్స్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ అందుకున్నారని పేర్కొంది.

అన్ని పూర్తి చేసినా.. జాయినింగ్‌ లేదు

నైట్స్ వివరాల ప్రకారం.. 2025 డిసెంబర్‌లో కూడా అభ్యర్థులు విప్రో అధికారిక సర్వే ద్వారా తమ ఆసక్తిని మరోసారి ధృవీకరించారు. కంపెనీ కోరిన అన్ని ప్రక్రియలను పూర్తి చేసినా ఇప్పటివరకు ఖచ్చితమైన ఆన్‌బోర్డింగ్‌ తేదీ ఇవ్వలేదని సంస్థ ఆరోపించింది. పలుమార్లు విప్రో హెచ్‌ఆర్‌, ఆన్‌బోర్డింగ్‌ హెల్ప్‌డెస్క్‌లను సంప్రదించినా స్పష్టమైన సమాధానం రాలేదని ఫిర్యాదులో పేర్కొంది. విద్యాసంస్థలు, ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ అధికారులు కూడా కంపెనీతో సంప్రదించి వివరాలు కోరినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపింది. దీంతో ఉద్యోగం వస్తుందనే నమ్మకంతో ఇతర అవకాశాలను వదులుకున్నామని పలువురు అభ్యర్థులు చెబుతున్నారని నైట్స్ పేర్కొంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ కుటుంబ ఆర్థిక బాధ్యతలు, విద్యా ఖర్చులు, వసతి ఖర్చులు పెరగడంతో యువత తీవ్ర అనిశ్చితిని ఎదుర్కొంటోందని తెలిపింది.

విప్రో ఏమంటోంది?

ఈ ఆరోపణలపై విప్రో తన స్పందనను కూడా వెల్లడించింది. ఎంపికైన ఫ్రెషర్లను వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఆన్‌బోర్డ్‌ చేసేందుకు సంస్థ కట్టుబడి ఉందని విప్రో ప్రతినిధి తెలిపారు. తదుపరి వివరాలను అభ్యర్థులకు తెలియజేస్తూనే ఉంటామని చెప్పారు. అయితే నైట్స్ మాత్రం సమస్యను అత్యవసరంగా పరిగణించి కార్మిక శాఖ జోక్యం చేసుకోవాలని కోరింది. యువత తమ కెరీర్‌ను ప్రారంభించే కీలక సమయంలో ఉద్యోగంపై ఆధారపడి ప్రణాళికలు, ఆర్థిక నిర్ణయాలు తీసుకున్నారని సంస్థ పేర్కొంది. జాయినింగ్‌ తేదీపై స్పష్టత లేకపోవడం వల్ల ప్రత్యామ్నాయ ఉద్యోగాలు, ఉన్నత విద్యపై నిర్ణయం తీసుకోలేకపోతున్నారని తెలిపింది. మొత్తంగా ఆఫర్‌ లెటర్‌ చేతిలో ఉన్నా ఉద్యోగంలో చేరే తేదీ తెలియని పరిస్థితి యువతలో ఆందోళనకు కారణమైంది. కార్మిక శాఖ జోక్యంతో ఈ వివాదానికి త్వరగా పరిష్కారం లభిస్తుందా అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.

 

#Wipro #WiproHiring #WiproEliteHiring #WiproOnboarding #OnboardingDelay #WiproJobs #ITJobs #FreshersJobs #JobOffer #JoiningDate #CampusRecruitment #EmploymentNews #ITNews #IndianIT #YouthEmployment #JobSeekers #LabourMinistry #MansukhMandaviya #RecruitmentNews #CareerNews