Home Telangana ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై భరోసా చదువే తలరాత మార్చే ఆయుధం!

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై భరోసా చదువే తలరాత మార్చే ఆయుధం!


విద్యతోనే ఆత్మగౌరవమన్న సీఎం.

చదువుతోనే ఆత్మగౌరవం, గుర్తింపు లభిస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల విగ్రహాలను నెక్లెస్‌ రోడ్డులో ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్య ఒక్కటే తలరాతను మార్చే మార్గమని పేర్కొన్నారు. 150 ఏళ్ల క్రితమే జ్యోతిబా ఫూలే విద్య ప్రాధాన్యాన్ని చాటిచెప్పారని గుర్తుచేశారు. కుల నిర్మూలన, సామాజిక చైతన్యం కోసం అన్ని వర్గాల పిల్లలు కలిసి చదువుకోవాలని సీఎం అన్నారు. అందుకే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. నర్సరీ నుంచి విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు అవసరమైన అన్ని సదుపాయాలు అందించే దిశగా విద్యా వ్యవస్థను సమగ్రంగా ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు.

ఏటా రూ.2,400 కోట్ల రీయింబర్స్‌మెంట్

విద్యార్థుల ఫీజు భారం తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని సీఎం స్పష్టం చేశారు. ఏటా రూ.2,400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ముందుగానే జమ చేసే విధానాన్ని ఈ ఏడాది నుంచే అమల్లోకి తెచ్చామని తెలిపారు. కళాశాలలో ప్రవేశం పొందిన తర్వాత విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే నెల రోజుల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఫీజులు చెల్లించలేదనే కారణంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఏ కళాశాలా అడ్డుకోలేని విధంగా చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఆటంకం కలగకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పారదర్శకంగా, వేగంగా అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు.

నైపుణ్యాలతోనే భవిష్యత్‌ భరోసా

సర్టిఫికెట్‌ ఒక్కటే ఉద్యోగానికి సరిపోదని, విద్యతో పాటు నైపుణ్యాలు కూడా అవసరమని రేవంత్‌రెడ్డి అన్నారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు స్కిల్స్‌ నేర్పాల్సిన అవసరం ఉందన్నారు. 2024లో టాటా సంస్థతో కలిసి 119 నియోజకవర్గాల్లో ఏటీసీలను ఏర్పాటు చేశామని, అక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్థులకు నెలకు రూ.2 వేల స్టైఫండ్‌ అందిస్తున్నామని తెలిపారు. క్రీడల్లో ప్రతిభ చూపి పతకాలు సాధించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పారు. బీసీ జనగణన, ఎస్సీ వర్గీకరణ వంటి నిర్ణయాలను సామాజిక న్యాయంలో భాగంగా ప్రస్తావించారు. పేద, బలహీన వర్గాల పిల్లలు చదువుకుని ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, వైద్యులు, ఇంజినీర్లు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణను ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు నాణ్యమైన విద్య, నైపుణ్యాలే కీలకమని పేర్కొన్నారు.

 

#RevanthReddy #FeeReimbursement #TelanganaEducation #StudentWelfare #EducationReforms #JyotibaPhule #SavitribaiPhule #TelanganaGovernment #SkillDevelopment #IntegratedSchools #TelanganaStudents #Education