Home AP హోదా ఇవ్వరు.. హక్కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదన్న జగన్

హోదా ఇవ్వరు.. హక్కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదన్న జగన్


అందుకే నాణేనికి మరోవైపుతో ప్రజల్లోకి

అసెంబ్లీ సమావేశాల ముందు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా వైఎస్సార్‌సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని జగన్‌ ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తిస్తే అసెంబ్లీలో మాట్లాడేందుకు తగిన సమయం హక్కుగా వస్తుందని, ఆ హక్కు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేకే హోదా ఇవ్వడం లేదని అన్నారు. అందుకే అసెంబ్లీలో తమకు పరిమిత అవకాశాలే ఉన్నాయని వ్యాఖ్యానించారు. అయితే సభలో మాట్లాడలేకపోయినా ప్రజల ముందు ప్రభుత్వ నిర్ణయాలను ఆధారాలతో ఎండగడతామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రస్తావించే అంశాలపై ప్రెస్‌మీట్ల ద్వారా ‘నాణేనికి మరోవైపు’ ప్రజలకు చూపిస్తామని చెప్పారు.

మండలిలో బలం.. ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపు

శాసనమండలిలో వైఎస్సార్‌సీపీకి ఉన్న బలాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని జగన్‌ ఎమ్మెల్సీలకు సూచించారు. ప్రజా సమస్యలపై గతంలో ఎలా పోరాడామో.. ఇకపై మరింత గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు, రైతుల సమస్యలు, పీపీపీ విధానం, నిరసనలపై కేసులు, బీసీ నేతలపై కేసులు వంటి అంశాలను ప్రధానంగా లేవనెత్తాలని ఆదేశించారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన కింద భారీగా బకాయిలు ఉన్నాయని ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు ధర, ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు.

సభలో స్వరం తక్కువైనా.. బయట పోరు ఎక్కువ

ప్రభుత్వం తీసుకొస్తున్న పీపీపీ విధానం ప్రజా సేవలను ప్రైవేటుకు అప్పగించే దిశగా ఉందని జగన్‌ విమర్శించారు. తాగునీరు, విద్య, వైద్యం వంటి రంగాలను కూడా ప్రైవేట్‌ పరిధిలోకి తీసుకెళ్లడం వల్ల చివరకు భారం ప్రజలపైనే పడుతుందని అన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం అణచివేస్తోందని ఆరోపించారు. మరోవైపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎలాంటి అంశమైనా ఆధారాలు, సాక్ష్యాలతోనే మాట్లాడాలని స్పష్టం చేశారు. ప్రిపరేషన్ లేకుండా సభలో మాట్లాడవద్దని సూచించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకపోయినా.. ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఆపబోమన్న సంకేతాన్ని జగన్‌ తాజా సమావేశం ద్వారా ఇచ్చారు. సభలో స్వరం పరిమితం అయితే.. ప్రజల్లోకి వెళ్లి ఆధారాలతో ప్రభుత్వాన్ని నిలదీయడమే తమ వ్యూహమని స్పష్టం చేశారు.

 

#YSJagan #JaganMohanReddy #YSRCP #Jagan #OppositionStatus #YSRCPOpposition #APPolitics #AndhraPradeshPolitics #JaganPoliticalStrategy #YSRCPMLAs #YSRCPMLCs #AssemblySession #ChandrababuNaidu #PoliticalNews #APNews