Home General కోకాపేటలో ట్రంప్‌ టవర్స్‌ 65 అంతస్తులు.. 240 మీటర్ల ఎత్తు

కోకాపేటలో ట్రంప్‌ టవర్స్‌ 65 అంతస్తులు.. 240 మీటర్ల ఎత్తు


పెంట్‌హౌస్‌ ధర రూ.62 కోట్లు
కోకాపేటలో భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో మరో భారీ ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధమైంది. కోకాపేట గోల్డెన్‌ మైల్‌ రోడ్డులో ట్రంప్‌ టవర్స్‌ నిర్మాణం చేపట్టనున్నారు. ట్రంప్‌ ఆర్గనైజేషన్‌, ట్రిబెకా డెవలపర్స్‌, ఐరా రియాల్టీ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నాయి. మొత్తం 65 అంతస్తులతో రెండు టవర్లు నిర్మించనున్నారు. సుమారు 240 మీటర్ల ఎత్తుతో రూపొందనున్న ఈ టవర్లలో 450 అత్యాధునిక లగ్జరీ ఫ్లాట్లు ఉండనున్నాయి. ప్రాజెక్టుకు ఇప్పటికే రెరా అనుమతులు లభించాయి. మూడేళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేయాలని సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. దక్షిణ భారతదేశంలో ట్రంప్‌ బ్రాండ్‌కు ఇది తొలి ప్రాజెక్టు కానుంది. దేశంలో ఇప్పటికే పుణె, ముంబయి, కోల్‌కతా, గురుగ్రామ్‌ వంటి నగరాల్లో ట్రంప్‌ బ్రాండ్‌ ప్రాజెక్టులు ఉన్నాయని డెవలపర్లు తెలిపారు. కోకాపేట ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్‌ లగ్జరీ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

రూ.62 కోట్ల పెంట్‌హౌస్‌.. భారీ పెట్టుబడులు

ఈ ప్రాజెక్టులో అత్యంత ఖరీదైన పెంట్‌హౌస్‌ ధర ఏకంగా రూ.62 కోట్లుగా నిర్ణయించినట్లు ట్రిబెకా డెవలపర్స్‌ వ్యవస్థాపకుడు కల్పేశ్‌ మెహతా తెలిపారు. భూమి ఖర్చును మినహాయిస్తే నిర్మాణానికి సుమారు రూ.1,700–1,800 కోట్లు వ్యయం అవుతుందని వెల్లడించారు. విక్రయాల ద్వారా రూ.3,500 కోట్ల నుంచి రూ.4,200 కోట్ల వరకు ఆదాయం రావచ్చని అంచనా వేశారు. హైదరాబాద్‌లో లగ్జరీ గృహాలకు పెరుగుతున్న డిమాండ్‌, కోకాపేటలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మౌలిక వసతులు ఈ ప్రాజెక్టుకు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. త్వరలో భూమిపూజ కార్యక్రమం నిర్వహించనుండగా, ట్రంప్‌ కుటుంబ సభ్యులు హాజరయ్యే అవకాశం ఉందని సంస్థలు వెల్లడించాయి. మొత్తంగా ఎత్తు, ధర, బ్రాండ్‌ విలువ, పెట్టుబడి పరిమాణం పరంగా కోకాపేట ట్రంప్‌ టవర్స్‌ హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో భారీ చర్చకు దారితీస్తోంది.

 

#TrumpTowers #Kokapet #TrumpTowersHyderabad #HyderabadRealEstate #KokapetRealEstate #TrumpOrganization #TribecaDevelopers #IraRealty #LuxuryRealEstate #LuxuryApartments #HyderabadProperty #KokapetLuxuryHomes #TrumpBrand #RealEstateNews #HyderabadNews