ఇది కదరా సక్సెస్ అంటే!
టీ అమ్మినోడు.. వేల కోట్లు గెలిచిన రాకీ భాయ్ అయ్యాడు…!
రోజుకు రూ.50 కోసం టీ అందించిన కుర్రాడు.. ఇప్పుడు వేల కోట్ల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. జేబులో రూ.300తో బెంగళూరు వచ్చిన యశ్.. కష్టాల కేజీఎఫ్‌ను దాటి సక్సెస్ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఇంటి నుంచి పారిపోయి వచ్చిన 16 ఏళ్ల కుర్రాడి కథ.. ఇప్పుడు కోట్లాది మంది అభిమానించే ‘రాకీ భాయ్’ కథగా మారింది. అవకాశాల కోసం తలుపులు తట్టిన రోజులు పోయాయి. ఇప్పుడు యశ్ కోసం ఇండస్ట్రీనే తలుపులు తెరుస్తోంది. ‘కేజీఎఫ్’లో రాకీ భాయ్‌గా ఎంట్రీ ఇచ్చిన యశ్.. బాక్సాఫీస్‌ను గోల్డ్ మైన్‌గా మార్చేశాడు. ‘కేజీఎఫ్ 2’తో పాన్ ఇండియా మార్కెట్‌ను షేక్ చేశాడు. ఇప్పుడు ‘టాక్సిక్’తో రూ.500 కోట్లకు పైగా భారీ ప్రాజెక్టులో హీరోగా దూసుకెళ్తున్నాడు. మరోవైపు దాదాపు రూ.4,000 కోట్ల భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ‘రామాయణం’లో రావణుడిగా సరికొత్త అవతార్‌లో కనిపించబోతున్నాడు. టీ అమ్మిన చేతులే ఇప్పుడు వేల కోట్ల సినిమాలకు నిర్మాతగా మారాయి. ఇదే కదరా సక్సెస్ అంటే!
రాకీ భాయ్‌గా తిరుగులేని స్టార్
కన్నడ స్టార్ యశ్ విజయగాథలో కష్టాలే తొలి మెట్టు. 16 ఏళ్ల వయసులో జేబులో కేవలం రూ.300తో నటుడు కావాలనే కలతో ఇంటి నుంచి బెంగళూరుకు వెళ్లాడు. తండ్రి బీఎంటీసీ బస్ డ్రైవర్, తల్లి గృహిణి. నటనలో విజయం రాకపోతే మరో పని చేయాలన్న షరతుతో తల్లిదండ్రులు అతడిని పంపారు. కల నెరవేర్చుకునే ప్రయాణంలో యశ్ ఎన్నో చిన్నచిన్న పనులు చేశాడు. థియేటర్ బృందంలో చేరి వెనుక పనిచేశాడు. బ్యాక్‌స్టేజ్‌లో టీ అందిస్తూ రోజుకు రూ.50 సంపాదించాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పనిచేశాడు. 2004లో టెలివిజన్‌లోకి అడుగుపెట్టి, 2007లో సినిమాల్లో నటుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ‘మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి’, ‘గూగ్లీ’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న యశ్‌కు 2018లో ‘కేజీఎఫ్’ అసలైన మలుపు. రాకీ భాయ్ పాత్ర దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ తెచ్చింది. 2022లో ‘కేజీఎఫ్ 2’ ప్రపంచవ్యాప్తంగా రూ.1,200 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో యశ్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఇప్పుడు యశ్ కెరీర్లోనే అత్యంత భారీ దశ మొదలైంది. ‘టాక్సిక్’ చిత్రం రూ.500 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్లు సమాచారం. మరోవైపు ‘రామాయణం’ రెండు భాగాలకు కలిపి దాదాపు రూ.4,000 కోట్ల భారీ వ్యయం జరుగుతోంది. ఇందులో యశ్ రావణుడిగా కనిపించనున్నాడు. రూ.50తో మొదలైన ప్రయాణం వేల కోట్ల సినిమాల స్థాయికి చేరడం యశ్ పట్టుదలకు నిదర్శనం.











