కోటి ఖర్చు అవాస్తవమన్న ప్రభుత్వం.
తప్పుడు ప్రచారం చేస్తే అంతే సంగతులు.
మంత్రి నారా లోకేశ్‌పై ఫార్చ్యూన్ ఇండియాలో కథనం ప్రచురించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలకుపైగా ఖర్చు చేసిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ ప్రభుత్వం ఖండించింది. ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రభుత్వ ఉత్తర్వులకు ఫార్చ్యూన్ ఇండియా కథనానికి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. 2025 జనవరి 18న జారీ చేసిన జీవోను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం పేర్కొంది. ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి అవకాశాలను ప్రచారం చేసేందుకు ఈ జీవో జారీ చేసినట్లు వివరించింది. ఓ ఆంగ్ల ఛానల్‌కు చెల్లింపులు చేయాలనే ఉద్దేశంతోనే ఆ ఉత్తర్వులు ఇచ్చినట్లు స్పష్టం చేసింది.
రెండు సంస్థలకు సంబంధం లేదు
ఫార్చ్యూన్ ఇండియా, సీఎన్‌బీసీ టీవీ రెండు వేర్వేరు సంస్థలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వాటికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. పెట్టుబడుల ఆకర్షణ కోసం జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను లోకేశ్‌పై వచ్చిన కథనంతో ముడిపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం చట్టవిరుద్ధమని హెచ్చరించింది. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు రూపొందించి ప్రచారం చేస్తున్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా, అలాంటి పోస్టులను తెలిసీ తెలియక షేర్ చేసే వారిపైనా చర్యలు తప్పవని హెచ్చరించింది.
#NaraLokesh #FortuneIndia #AndhraPradeshGovernment #APGovernment #NaraLokeshNews #FortuneIndiaArticle #SocialMediaFakeNews #APPolitics #AndhraPradeshPolitics #GovernmentClarification #FakeNews #CNBCTV18 #APInvestmentPromotion #WorldEconomicForum #GovernmentOrders #SocialMediaRumours











