ప్రపంచానికి చైనా పిలుపు.
ఏఐలో అగ్రరాజ్యానికి సవాల్!
ఓపెన్ సోర్స్‌పై జిన్‌పింగ్ దూకుడు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఒక్క దేశం ఆధిపత్యం చెలాయించకూడదని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ స్పష్టం చేశారు. షాంఘైలో జరిగిన వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏఐ అభివృద్ధి ఒకే దేశం ప్రదర్శన కాకుండా ప్రపంచ దేశాల ఉమ్మడి సహకారంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. చైనా మరింత పారదర్శకంగా వ్యవహరిస్తుందని, ప్రపంచంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు.
అమెరికాకు పరోక్ష హెచ్చరిక
జీ జిన్‌పింగ్ అమెరికా పేరును నేరుగా ప్రస్తావించకపోయినా ఆయన వ్యాఖ్యలు స్పష్టంగా అమెరికా టెక్ కంపెనీలనే లక్ష్యంగా చేసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఓపెన్‌ఏఐ, ఆంత్రోపిక్ వంటి అమెరికా సంస్థలు తమ అత్యాధునిక ఏఐ మోడళ్లను ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉంచడం లేదని పరోక్షంగా విమర్శించారు. ప్రపంచ భవిష్యత్తును ప్రభావితం చేసే సాంకేతికతపై కొద్ది సంస్థలకే నియంత్రణ ఉండకూడదని సూచించారు.
ఓపెన్ సోర్స్ చైనా వ్యూహం
ఏఐ రంగంలో ఓపెన్ సోర్స్ విధానాన్ని చైనా ప్రధాన ఆయుధంగా మార్చుకుంటోంది. షీ ప్రసంగించిన రోజే బీజింగ్‌కు చెందిన మూన్‌షాట్ సంస్థ ‘కిమీ కే3’ పేరుతో భారీ ఓపెన్ ఏఐ మోడల్‌ను విడుదల చేసింది. ఇప్పటికే డీప్‌సీక్, జీఎల్‌ఎం 5.2 వంటి చైనా మోడళ్లు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. చాట్‌జీపీటీ, క్లాడ్, జెమినీ వంటి అమెరికా మోడళ్లకు చైనా వేగంగా పోటీ ఇస్తోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏఐ రంగంలో ప్రపంచ సహకారాన్ని పెంచేందుకు చైనా కొత్తగా వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసింది. షాంఘై కేంద్రంగా పనిచేసే ఈ కూటమిలో ఇండోనేషియా, బ్రెజిల్, రష్యా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ సహా 29 దేశాలు చేరాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఏఐ పాలనలో పెద్దపీట వేయాలన్నదే ఈ వేదిక లక్ష్యమని జీజిన్‌పింగ్ తెలిపారు. ఇది అమెరికా ఆధ్వర్యంలో ఏర్పడిన మరో అంతర్జాతీయ ఏఐ వేదికకు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు.
ఓపెన్ మాట.. పరిమితుల బాట
ఏఐ వ్యవస్థలు ఎప్పటికీ మానవ నియంత్రణలోనే ఉండాలని జీజిన్‌పింగ్ స్పష్టం చేశారు. ప్రమాదకర పరిస్థితులను ముందుగానే గుర్తించే హెచ్చరిక వ్యవస్థలు, అత్యవసర ప్రతిస్పందన యంత్రాంగం అవసరమని సూచించారు. సాంకేతికంగా వెనుకబడిన దేశాల కోసం ఐదు వేల శిక్షణ అవకాశాలు కల్పిస్తామని ప్రకటించారు. దీంతో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఏఐ సాంకేతికత అందుబాటులోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. చైనా ఓపెన్ సోర్స్‌కు మద్దతు ప్రకటిస్తున్నప్పటికీ కొన్ని అత్యాధునిక ఏఐ మోడళ్లను విదేశాల్లో వినియోగించడంపై పరిమితులు విధించే ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం. జాతీయ భద్రత దృష్ట్యా కొన్ని నియంత్రణలు అవసరమని బీజింగ్ భావిస్తోంది. దీంతో ఒకవైపు ప్రపంచ సహకారం గురించి మాట్లాడుతున్న చైనా, మరోవైపు వ్యూహాత్మక నియంత్రణలను కొనసాగించడం చర్చనీయాంశంగా మారింది. ఏఐ రంగంలో అమెరికా-చైనా మధ్య పోటీ ఇప్పుడు సాంకేతికతతో పాటు ప్రపంచ నాయకత్వ పోరుగా కూడా రూపుదిద్దుకుంటోంది.











