దేశంలో పెట్టుబడుల్లో పావు వంతు మనకే.
త్వరగా అనుమతులు ఇవ్వడం వల్లే పెట్టుబడులు.
దాల్మియా సిమెంట్ పరిశ్రమ రెండో ప్లాంట్ విస్తరణ.
శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేశ్.
రాష్ట్రంలో పారిశ్రామిక అనుమతులను వేగంగా మంజూరు చేయడం వల్లే భారీ పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. దేశానికి వచ్చే మొత్తం పెట్టుబడుల్లో 25 % ఆంధ్రప్రదేశ్‌కే వస్తున్నాయని చెప్పారు. పొరుగు రాష్ట్రాలతో పోటీ పడుతూ కొత్త పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొస్తున్నామని వెల్లడించారు. వైఎస్సార్ కడప జిల్లా మైలవరం మండలం చిన్నకొమెర్లలో దాల్మియా సిమెంట్ పరిశ్రమ రెండో ప్లాంట్ విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. దాల్మియా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పునీత్ దాల్మియాతో కలిసి భూమిపూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
రూ.3,100 కోట్ల విస్తరణ
దాల్మియా గ్రూప్ సిమెంట్ రంగంలో బలమైన సంస్థగా ఎదిగిందని లోకేశ్ అన్నారు. రూ.3,100 కోట్లతో చేపడుతున్న ప్లాంట్ విస్తరణ వల్ల మరో 700 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతిందని ఆరోపించారు. రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి బాటలోకి తీసుకురావడానికి రెండేళ్లుగా నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు.
జగన్‌పై తీవ్ర విమర్శలు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మంత్రి లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పార్టీ హిట్ అండ్ రన్ పార్టీ అంటూ వ్యాఖ్యానించారు. పలు సంఘటనలను ప్రస్తావిస్తూ గత ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు. బ్రాహ్మణీ స్టీల్స్‌కు అప్పట్లో ఎకరాకు రూ.19 వేల చొప్పున 11 వేల ఎకరాలు కేటాయించారని చెప్పారు. ఆ వ్యవహారంలో లబ్ధి కొందరికే దక్కిందని ఆరోపించారు. చట్టపరమైన ప్రక్రియ ప్రకారం ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని వెల్లడించారు.
ప్రభుత్వ పనితీరుపై వివరణ
గత ఐదేళ్ల పాలనలో ఉద్యోగాల కల్పన, సంక్షేమం విషయంలో ఆశించిన ఫలితాలు కనిపించలేదని లోకేశ్ విమర్శించారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించినా నియామకాలు జరగలేదని ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందని చెప్పారు. త్వరలో మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని వెల్లడించారు. ఇటీవల ప్రమాదంలో మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించినట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ఉపాధి కల్పన, పెట్టుబడుల ఆకర్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.











