Home AP చంద్రబాబుపై జగన్ సెటైర్లు

చంద్రబాబుపై జగన్ సెటైర్లు

చదరపు అడుగుకు ₹ 29,340 ?
₹2,271 కోట్ల నుంచి ₹6,641 కోట్లా!
అమరావతి నిర్మాణాల అంత ఖర్చా?

అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ వ్యయంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి ఇంత భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. ఐదు భవనాల నిర్మాణానికి సంబంధించిన లెక్కలను ప్రస్తావిస్తూ చదరపు అడుగుకు రూ.29,340 ఖర్చవుతోందంటూ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై వైసీపీ చేసిన ఆరోపణలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

రూ.2,271 కోట్ల నుంచి రూ.6,641 కోట్లకు!

2018లో కొత్త సచివాలయ భవనాల నిర్మాణానికి రూ.2,271 కోట్ల అంచనా వ్యయం నిర్ణయించారని వైసీపీ తన పోస్టులో జగన్ పేర్కొన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత టెండర్లను రద్దు చేసి, నిర్మాణ అంచనాలను భారీగా పెంచిందని జగన్ ఆరోపించారు. 2025 ఏప్రిల్‌లో మళ్లీ అవే కంపెనీలకు పనులు అప్పగించి కాంట్రాక్టు విలువను రూ.4,689 కోట్లకు చేర్చారని విమర్శించారు. తాజాగా ఈ అంచనాలను మరోసారి పెంచి రూ.6,641 కోట్లకు తీసుకెళ్లారన్నారు. ఒకే నిర్మాణ పనులకు అంచనాలు ఇంత భారీగా ఎలా పెరిగాయన్నదే జగన్ లేవనెత్తుతున్న ప్రధాన ప్రశ్న.

ఐదు భవనాలు.. రూ.15,317 కోట్ల లెక్క!

ఐదు ప్రభుత్వ భవనాలకు సంబంధించి 52.20 లక్షల చదరపు అడుగుల నిర్మాణానికి మొత్తం రూ.15,317 కోట్లు ఖర్చవుతున్నట్లు జగన్ విమర్శలుగుప్పించారు. దీనికి అదనంగా అద్దాలు, ఏసీలు ఇతర పనుల కోసం మరో రూ.4,830 కోట్లు కేటాయించినట్లు ఆరోపించారు. ఈ లెక్కల ప్రకారం చదరపు అడుగుకు రూ.29,340 ఖర్చవుతోందని ప్రశ్నించారు. ఉద్యోగులు విధులు నిర్వహించే ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి ఇంత భారీ వ్యయం ఎందుకని నిలదీసింది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో ఫైవ్‌స్టార్ సదుపాయాలతో కూడిన భవనాల నిర్మాణానికి సైతం చదరపు అడుగుకు రూ.5 వేలకంటే ఎక్కువ ఖర్చు కాదని వైసీపీ తన వాదనలో జగన్ పేర్కొన్నారు.

రాయితీలు ఇచ్చినా.. ఖర్చు ఎందుకింత?

నిర్మాణ పనులకు ఉచిత ఇసుకతో పాటు విద్యుత్ ఛార్జీలు, సీనరేజ్, ఎన్‌ఏసీ ఛార్జీల్లో రాయితీలు కల్పించిన విషయాన్ని వైసీపీ ప్రస్తావించింది. ఇన్ని మినహాయింపులు ఇచ్చిన తర్వాత కూడా నిర్మాణ వ్యయం భారీగా పెరగడంపై అనుమానాలు వ్యక్తం చేసింది. కాంట్రాక్టుల విలువలు పెరుగుతున్న తీరుపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. ప్రజలపై అప్పుల భారం పెరుగుతున్న సమయంలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ఇంత భారీగా నిధులు వెచ్చించడంపై వివరణ ఇవ్వాలని కోరింది.

అమరావతి నిర్మాణాలపై రాజకీయ రగడ!

అమరావతిని అంతర్జాతీయ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి, నిర్మాణ వ్యయాలపై ప్రతిపక్షం లేవనెత్తుతున్న ప్రశ్నలకు మధ్య రాజకీయ చర్చ వేడెక్కుతోంది. నిర్మాణాల అంచనాలు ఎందుకు పెరిగాయి? పాత టెండర్లను ఎందుకు రద్దు చేశారు? అదనపు పనుల పేరుతో కేటాయించిన నిధులకు ప్రాతిపదిక ఏమిటి? అన్న ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. నిర్మాణాల వాస్తవ వ్యయం, అంచనాల పెంపునకు కారణాలు, కాంట్రాక్టుల వివరాలపై ప్రభుత్వం అధికారికంగా వివరణ ఇస్తేనే పూర్తి వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మొత్తంగా అమరావతి నిర్మాణాలు మరోసారి అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ విమర్శలకు కేంద్రంగా మారాయి.

 

#YSJagan #ChandrababuNaidu #Amaravati #AmaravatiConstruction #AndhraPradeshPolitics #YSRCP #GovernmentBuildings #ConstructionCosts #SecretariatBuildings