ఏడాదిన్నరలో ప్రతి అంగుళం భూమికి కొత్త గుర్తింపు!
వ్యవసాయ భూములకు, ఇళ్ల స్థలాలకు ప్రత్యేక పత్రాలు!
ప్రతి అంగుళం భూమికి శాస్త్రీయ సర్వే, క్యూఆర్ కోడ్‌తో బుక్స్.
తెలంగాణలో తరతరాలుగా కొనసాగుతున్న భూ వివాదాలకు శాశ్వతంగా తెరదించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూమిని శాస్త్రీయంగా కొలిచి, స్పష్టమైన హద్దులు నిర్ణయించి, భూ యజమానులకు కొత్త గుర్తింపు కల్పించనుంది. రానున్న ఏడాదిన్నరలో రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూ రీసర్వే పూర్తి చేస్తాం అని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మొదటి విడతలో జిల్లాకు 70 గ్రామాల చొప్పున మ్యాపులు లేని 373 గ్రామాల్లో సర్వే చేపట్టామని, డిసెంబర్ చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. ఇప్పటికే తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి ప్రజాప్రతినిధులు, రైతులతో సమావేశమై క్షేత్రస్థాయి సమస్యలను తెలుసుకున్నామని చెప్పారు. భూముల విస్తీర్ణంలో తేడాలు, సరిహద్దు వివాదాల పరిష్కారానికి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు నేరుగా రంగంలోకి దిగుతారని స్పష్టం చేశారు.
క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పూర్తి వివరాలు
రీసర్వే పూర్తయిన తర్వాత రైతులకు ఉచితంగా అత్యాధునిక పాస్ పుస్తకాలు అందించనున్నారు. ఇవి వాటర్‌ప్రూఫ్‌తో పాటు చిరిగిపోని విధంగా రూపొందిస్తారు. పాస్ పుస్తకంపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సర్వే నంబర్, భూమి విస్తీర్ణం, భూ పటం వివరాలు క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఒకే పాస్ పుస్తకంలో యజమానికి సంబంధించిన వివిధ సర్వే నంబర్లు, భూముల వివరాలు పొందుపరుస్తారు. గ్రామాల్లోని ఇళ్లు, నివాస స్థలాలు, ఆబాదీ ఆస్తులకు కూడా ప్రత్యేక సర్వే నిర్వహించనున్నారు. 100, 150 లేదా 500 గజాలు.. ఎంత స్థలం ఉన్నా మ్యాప్‌తో కూడిన ఆస్తి గుర్తింపు పత్రం అందించనున్నారు. వ్యవసాయ భూములకు ఒక రంగు, ఆబాదీ ఆస్తులకు మరో రంగులో వేర్వేరు పాస్ పుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. సర్వేకు ముందే గ్రామాల్లో చాటింపు వేయించి ప్రజలకు సమాచారం ఇస్తారు. సర్వే అనంతరం అభ్యంతరాలు స్వీకరించి, న్యాయమైన వాటికి సవరణలు చేస్తారు. ప్రైవేటు భూ వివాదాల్లో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని, ప్రభుత్వ భూముల సమస్యలను అధికారిక రికార్డుల ఆధారంగా పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు.
బీజేపీపై విమర్శలు.. బీఆర్ఎస్పై సెటైర్లు
భూ రీసర్వే కేవలం కొలతల కార్యక్రమం కాదని, భవిష్యత్ తరాలకు భద్రమైన భూ హక్కులు కల్పించే చారిత్రక ప్రయత్నమని పొంగులేటి పేర్కొన్నారు. సర్వేలో పారదర్శకతకు పెద్దపీట వేస్తామని, నిబంధనలు ఉల్లంఘించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని విమర్శించారు. రాష్ట్రానికి 13 లక్షల ఇళ్లు కోరితే కేవలం రెండు లక్షలే మంజూరు చేశారని, గతంలో ఏపీకి 17 లక్షల ఇళ్లు కేటాయించారని ఆరోపించారు. తాజాగా తెలంగాణకు రెండు లక్షల ఇళ్లు ఇవ్వగా, ఏపీకి నాలుగు లక్షలు మంజూరు చేశారని పేర్కొన్నారు. మరోవైపు బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటోందని వ్యాఖ్యానించారు. కక్ష సాధింపు తమ ప్రభుత్వ విధానం కాదని, ఒక్కరోజు ఆలస్యమైనా ప్రతి పనిని శాస్త్రీయంగా, నిజాయితీగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ భూ రీసర్వే దేశానికే ఆదర్శంగా నిలవాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.
#Telangana #LandResurvey #PonguletiSrinivasaReddy #LandDisputes #QRcodePassbooks #DigitalLandRecords #AgriculturalLand #PropertySurvey #TelanganaGovernment #RevenueDepartment











