Home Telangana నకిలీ కాదు.. నిషేధిత మందుల దందా!

నకిలీ కాదు.. నిషేధిత మందుల దందా!

ప్రిస్క్రిప్షన్ లేకుండానే టాపెంటడాల్ విక్రయం.
నేరేడ్మెట్‌లో లక్ష సరుకు సీజ్!
పది మాత్రలకు రూ.500 వసూలు!
మెడికల్ షాపుపై టీజీ-సేఫ్ మెరుపు దాడి!
రహస్య సమాచారంతో రంగంలోకి అధికారులు

ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన మందుల దుకాణమే అక్రమ ఔషధ విక్రయాలకు అడ్డాగా మారింది. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే అలవాటుగా మారే ప్రమాదం ఉన్న టాపెంటడాల్ మాత్రలను అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యవహారం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో వెలుగుచూసింది. నేరేడ్మెట్‌లోని వినాయక్ నగర్‌లో ఉన్న సహస్ర మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్‌పై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ-సేఫ్) డ్రగ్స్ విభాగం, ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. దుకాణం భాగస్వామి, రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ఎస్. రాజు అక్రమంగా టాపెంటడాల్ మాత్రలు విక్రయిస్తున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారంతో ఈ చర్యలు చేపట్టారు. తనిఖీల్లో భారీగా మందుల నిల్వలను గుర్తించిన అధికారులు రూ.లక్ష విలువైన 330 టాపెంటడాల్-100 స్ట్రిప్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కొనుగోలు ఇన్వాయిస్‌లను కూడా స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ ప్రారంభించారు.

ప్రిస్క్రిప్షన్ లేదు.. బిల్లులు లేవు..

నిబంధనలకు విరుద్ధంగా వైద్యుల చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఈ మాత్రలను విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. విక్రయాలకు బిల్లులు ఇవ్వకపోవడంతోపాటు షెడ్యూల్ హెచ్‌1 మందుల రిజిస్టర్‌లో వివరాలు నమోదు చేయడం లేదని తేల్చారు. పది మాత్రలకు సుమారు రూ.500 చొప్పున అధిక ధర వసూలు చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. టాపెంటడాల్ అనేది తీవ్రమైన నొప్పి నియంత్రణకు ఉపయోగించే ఓపియాయిడ్ ఔషధం. ఇది అలవాటుగా మారే ప్రమాదం ఉండటంతో షెడ్యూల్ హెచ్‌1 కేటగిరీలో చేర్చారు. రిజిస్టర్డ్ వైద్యుడి ప్రిస్క్రిప్షన్ ఉంటేనే విక్రయించాలి. ఇలాంటి మందులను అక్రమంగా వినియోగించడం వల్ల ఆధారపడే పరిస్థితి ఏర్పడటంతోపాటు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం అక్రమంగా ఇలాంటి మందులను మళ్లించడం శిక్షార్హమైన నేరం. నేరం రుజువైతే రెండేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

అక్రమ మందుల విక్రయాలపై కఠిన చర్యలు

ఈ దాడిలో డ్రగ్స్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కె. ప్రభాకర్ పర్యవేక్షణలో డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు కె. మురళీకృష్ణ, బి. గోవింద్ సింగ్, జి. అనిల్ పాల్గొన్నారు. డిప్యూటీ డైరెక్టర్ జి. శ్రీనివాస్ పర్యవేక్షణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది కూడా తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నవారిపై మరింత విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని టీజీ-సేఫ్ కమిషనర్ స్పష్టం చేశారు. ప్రిస్క్రిప్షన్ మందులను నిబంధనలకు విరుద్ధంగా విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మందుల అక్రమ తయారీ, విక్రయాలు, మత్తు పదార్థాల అనుమానాస్పద కార్యకలాపాలపై ప్రజలు టోల్‌ఫ్రీ నంబర్ 1800-599-6969కు ఫిర్యాదు చేయవచ్చు. ఈ సేవలు పని దినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.

#Tapentadol #TGSAFE #Neredmet #Telangana #DrugSeizure #MedicalStoreRaid #IllegalDrugSales #PrescriptionDrugs #ScheduleH1 #DrugEnforcement