కాంగ్రెస్‌కు భిక్ష వేస్తారా?
మిత్రపక్షాల మధ్య మంటలు
ఇమ్రాన్ వ్యాఖ్యలపై ఇక్ఱా ఆగ్రహం
26 సీట్ల ఆఫర్‌పై కాంగ్రెస్ అసంతృప్తి
ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఇండియా కూటమిలో సీట్ల పంపకాల వివాదం ముదురుతోంది. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కాంగ్రెస్‌కు కేవలం 26 స్థానాలు మాత్రమే కేటాయిస్తామంటూ చేసిన ప్రతిపాదన హస్తం పార్టీకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ, యూపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ మసూద్ మరోసారి ఘాటుగా స్పందించారు. ఎస్పీ ఇచ్చినన్ని సీట్లతో సర్దుకుపోయేది లేదని, తమ పార్టీ భిక్ష అడిగే పరిస్థితిలో లేదని స్పష్టం చేశారు. అఖిలేశ్ యాదవ్ తమ పార్టీకి షరతులు విధించాల్సిన అవసరం లేదన్నారు. ఎస్పీకి గెలిచే స్థానాలపై నమ్మకం ఉంటే 2022లో ఎందుకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిందని ప్రశ్నించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ మద్దతుతోనే ఎస్పీ మెరుగైన ఫలితాలు సాధించిందని వ్యాఖ్యానించారు. తొలుత 181 స్థానాలు కోరిన కాంగ్రెస్.. ఆ తర్వాత 131, 110 స్థానాలకు తన డిమాండ్‌ను తగ్గించుకుంది. అయినప్పటికీ ఎస్పీ 26 స్థానాలకే పరిమితం చేయడం కాంగ్రెస్‌కు అవమానంగా మారింది.
అఖిలేశ్ తీరుపై ఇమ్రాన్ అసహనం
సీట్ల కేటాయింపులో ఎస్పీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఇమ్రాన్ ఆరోపించారు. చర్చలు పూర్తికాకముందే ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం వివాదానికి కారణమైంది. వీటిలో బెహట్, సహరన్పూర్ స్థానాలను కాంగ్రెస్ కూడా ఆశిస్తోంది. గెలుపు అవకాశాల ఆధారంగా సీట్లు కేటాయించాలన్న అఖిలేశ్ సూచనపైనా ఇమ్రాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సహరన్‌పూర్‌లో తన బలం లేకుండా ఎస్పీ ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. గతంలో ఆ రెండు స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాదు, కాంగ్రెస్‌కు కేటాయించినట్లు చెబుతున్న 26 స్థానాల జాబితాను మీడియా ద్వారా వెల్లడించడం తమను అవమానించడమేనన్నారు. తమ పార్టీకి గౌరవం ఇవ్వకుండా కూటమి చర్చలు సాగించడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. కూటమి భవిష్యత్తుపై నిర్ణయం కాంగ్రెస్ పార్టీనే తీసుకుంటుందని ప్రకటించారు.
ఇక్ఱా హసన్ కౌంటర్.. కూటమిలో అనుమానాలు
ఇమ్రాన్ వ్యాఖ్యలను సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఇక్ఱా హసన్ తీవ్రంగా తప్పుబట్టారు. వాటిని బాధ్యతారహితమైన, అవమానకర వ్యాఖ్యలుగా అభివర్ణించారు. ఒక వ్యక్తి వ్యక్తిగత ఆకాంక్షలు, అహంకారం కంటే కూటమి ప్రయోజనాలే ముఖ్యమని హితవు పలికారు. అఖిలేశ్ యాదవ్ చేసిన విజ్ఞప్తి కూటమిని కలిపి ఉంచే ప్రయత్నమేనని సమర్థించారు. మరోవైపు సమాజ్‌వాదీ ఎంపీ జియా ఉర్ రెహమాన్ బర్క్ ఈ వివాదాన్ని వ్యక్తిగత అసంతృప్తిగా అభివర్ణిస్తూ పరిస్థితిని చల్లబరిచే ప్రయత్నం చేశారు. అయితే ఎస్పీ వర్గాలు మాత్రం కాంగ్రెస్ వైఖరిపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి. సహరన్‌పూర్‌లో ఎస్పీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలున్నాయన్న ప్రచారం కూడా రాజకీయ వేడిని పెంచుతోంది. నిన్న రెండు పార్టీల నేతలు రెండో విడత చర్చల్లో సానుకూలంగా కనిపించినా.. తాజా పరిణామాలు మిత్రపక్షాల మధ్య నమ్మకం సన్నగిల్లుతోందని స్పష్టం చేస్తున్నాయి. మరో రెండు విడతల చర్చలతో సీట్ల పంపకాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. అప్పటివరకు ఈ వివాదం కూటమిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.
#UPElections2027 #Congress #SamajwadiParty #ImranMasood #IqraHasan #AkhileshYadav #INDIAAlliance #SeatSharing #UttarPradeshPolitics











