రెండోసారి అధికారమే లక్ష్యం.
నేతలకు రేవంత్ దిశానిర్దేశం.
హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆదివారం జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు లక్ష్యాలను ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కోటి ఓట్లు సాధించి, మొత్తం 119 స్థానాలకు గాను 90 సీట్లు గెలుచుకోవడమే లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి రావడానికి ఇప్పటి నుంచే రాజకీయ వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పదవుల కోసం ఢిల్లీ, గాంధీభవన్ చుట్టూ తిరగకుండా గ్రామాలు, గూడేలు, తండాల్లో ప్రజల మధ్య ఉండాలని సూచించారు. పైరవీలు, సిఫార్సులతో పార్టీలో పదవులు రావని, పార్టీ కోసం నిజాయతీగా కష్టపడిన వారినే గుర్తించి బాధ్యతలు అప్పగిస్తామని తేల్చిచెప్పారు.
కష్టపడిన వారికే పదవులు.. మిగతావారికి హెచ్చరిక!
తాను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకు ప్రయత్నించిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అయినా కేవలం 90 రోజుల్లో డిజిటల్ సభ్యత్వ నమోదు ద్వారా 48 లక్షల మందిని పార్టీలో చేర్పించామని గుర్తుచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 92,35,833 ఓట్లు సాధించి 64 స్థానాల్లో విజయం సాధించిందన్నారు. ఈ విజయానికి కార్యకర్తల కష్టమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి ఎమ్మెల్యే టికెట్లు, మంత్రి పదవులు, ఎమ్మెల్సీ అవకాశాలు కల్పించామని, టికెట్లు రానివారికి కార్పొరేషన్ ఛైర్మన్ బాధ్యతలు ఇచ్చామని వివరించారు. నాయకుల ప్రవర్తన, మాటతీరును పార్టీ గమనిస్తోందని, ఎవరు ఎంత పనిచేశారో ఎన్నికల సమయంలో లెక్క తేలుతుందని హెచ్చరించారు. ప్రస్తుతం నిరాశలో ఉన్నవారికి కూడా భవిష్యత్తులో తగిన గుర్తింపు లభిస్తుందని భరోసా ఇచ్చారు.
సంక్రాంతి తర్వాత ప్రజాక్షేత్రంలోకి కాంగ్రెస్!
సంక్రాంతి తర్వాత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. గతంలో ఎన్టీఆర్, వైఎస్సార్, కేసీఆర్ ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే మరిన్ని పథకాలను ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ విజయాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ప్రభుత్వం చేసిన మంచిని మైక్‌లో చెప్పాలి.. లోపాలను చెవిలో చెప్పాలి అంటూ నాయకులకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారంతో తిరిగి అధికారంలోకి రావాలని చూస్తోందని విమర్శించారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో ఆ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని తప్పుబట్టారు. పార్టీ శ్రేణులంతా విభేదాలను పక్కనపెట్టి సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. 90 సీట్ల లక్ష్యంతో ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోందని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
#RevanthReddy #TelanganaCongress #CongressParty #OneCroreVotes #90SeatsTarget #TelanganaElections #TPCC #GandhiBhavan #CongressStrategy #TelanganaPolitics











