ఏడాదికి రెండున్నర వేలకోట్ల అదనపు భారం.
ఎల్‌నినో పరిస్థితులపై భేటీలో సుదీర్ఘ చర్చ.
కరవు పరిస్థితులపై చర్యలకు సమాలోచనలు.
డిజిటల్ మీడియా అడ్వర్టైజింగ్‌కు న్యూ పాలసీ.
కేబినెట్ కీలక నిర్ణయాలు.
తెలంగాణ మంత్రివర్గం ఉద్యోగులు, పెన్షనర్లకు కీలక ఊరట కల్పించింది. పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 3.64 శాతం, 2.74 శాతం చొప్పున డీఏలు మంజూరు చేయనున్నారు. ఒక డీఏను త్వరలో వచ్చే జీతంతో కలిపి చెల్లించనుండగా, మరో విడతను తదుపరి షెడ్యూల్ ప్రకారం విడుదల చేయనున్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన జీపీఎఫ్, గ్రాట్యుటీ, వైద్య బిల్లుల బకాయిలను కూడా దశలవారీగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కరువు పరిస్థితులపై ప్రత్యేక దృష్టి
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. కరువు మండలాలను గుర్తించి కేంద్రం నుంచి ఆర్థిక సాయం కోరాలని నిర్ణయించింది. కరువు పరిస్థితులపై నివేదిక ఇచ్చేందుకు సబ్‌కమిటీని ఏర్పాటు చేయనున్నారు. అనంతరం అఖిలపక్ష సమావేశం నిర్వహించి రైతు సంఘాలు, నిపుణుల సూచనలు తీసుకోవాలని నిర్ణయించారు. సుమారు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అవసరమైన కేంద్రాలు, సిబ్బంది, మౌలిక వసతులు సిద్ధం చేయాలని ఆదేశించారు.
విద్యుత్‌కు భారీగా కొత్త సామర్థ్యం
ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరగడంతో సరఫరాపై కేబినెట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. పీక్ డిమాండ్ 19,892 మెగావాట్లకు చేరిన నేపథ్యంలో 7,800 మెగావాట్ల కొత్త విద్యుత్ సామర్థ్యానికి ఆమోదం తెలిపింది. ఇందులో 3,000 మెగావాట్ల సోలార్, 4,000 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, 800 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. అవసరమైతే విద్యుత్ కొనుగోలు చేసి కోతలు లేకుండా సరఫరా చేయాలని నిర్ణయించారు.
ప్రాజెక్టులపై సమీక్ష.. డిజిటల్ పాలసీ
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పునఃసమీక్షించాలని కేబినెట్ నిర్ణయించింది. గతంలో చేపట్టిన 10 ఈపీసీ సాగునీటి ప్రాజెక్టులను నిలిపివేయడానికి ఆమోదం తెలిపింది. రంగారెడ్డి జిల్లా కోహెడలో సమీకృత పండ్ల మార్కెట్ పనులను వేగవంతం చేయాలని నిర్ణయించింది. తెలంగాణ డిజిటల్ మీడియా అడ్వర్టైజింగ్ పాలసీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ప్రకటనలను డిజిటల్ మీడియాకు జారీ చేసేందుకు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించనున్నారు.
#TelanganaCabinet #DAHike #GovernmentEmployees #Pensioners #Telangana #DearnessAllowance #ElNino #Drought #PowerProjects #DigitalMediaPolicy #TelanganaGovernment #CabinetDecisions











