Home AP ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి తూట్లు

ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి తూట్లు

కూటమిపై బొత్స తీవ్ర ఆరోపణలు.
అధికార దుర్వినియోగంతో గెలుప.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా విమర్శించారు. అధికార బలంతో అరాచకాలకు పాల్పడి గెలుపొందడాన్ని చూసి చంద్రబాబు సంబరపడుతున్నారని ఆరోపించారు. ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలిచినట్లు ప్రకటించిన తర్వాత కూడా మళ్లీ ఎన్నికలు నిర్వహించడం ఏ తరహా ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. పూసపాటిరేగ మండలంలో మహంతి శ్రీనివాసరావు వైస్‌ ఎంపీపీగా ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రం ఇచ్చిన తర్వాత మళ్లీ ఎన్నిక జరిపారని తెలిపారు. ఇలాంటి పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని మండిపడ్డారు.

గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం

పలుచోట్ల వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులు జరిగాయని బొత్స ఆరోపించారు. ఎమ్మెల్యే లోకం మాధవి, ఆమె భర్త ఎన్నికల అధికారులను బెదిరించారని విమర్శించారు. రాబోయే రోజుల్లో ఇలాంటి పరిణామాలే రాజకీయాల్లో ప్రమాదకర సంప్రదాయాలకు దారితీస్తాయని హెచ్చరించారు. ఈ ఘటనలన్నింటినీ గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. మరుసటి రోజు సాయంత్రం నాలుగు గంటలకు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తామని, ప్రస్తుత పరిస్థితుల్లో పాలించే నైతిక హక్కు ప్రభుత్వానికి లేదని బొత్స తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 

#BotsaSatyanarayana, #YSRCP, #AndhraPradeshPolitics, #LocalBodyElections, #ElectionAllegations, #ChandrababuNaidu, #CoalitionGovernment, #MPP Elections, #Pusapatirega, #Governor