దేశంలోనే అత్యుత్తమ క్రీడా సంబరాలకు సిద్ధం.
రూ.203.36 కోట్లతో అంతర్జాతీయ స్థాయి ఏర్పాట్లు.
రాష్ట్ర క్రీడా చరిత్రలో సరికొత్త అధ్యాయం!
తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026ను దేశంలోనే అత్యుత్తమంగా నిర్వహించి రాష్ట్ర సత్తా చాటాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు జరిగే ఈ పోటీలతో తెలంగాణలో క్రీడా పండుగ వాతావరణం నెలకొల్పుతామని తెలిపారు. మంగళవారం హైదరాబాద్ సచివాలయంలో ప్రముఖ క్రీడాకారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పోటీల నిర్వహణ కోసం సీఎం రేవంత్ రెడ్డి రూ.203.36 కోట్లు కేటాయించడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గచ్చిబౌలి, ఎల్బీ స్టేడియాలతో పాటు ఇతర క్రీడా వేదికలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఈ మౌలిక సదుపాయాలు రాబోయే 15 నుంచి 20 ఏళ్ల అవసరాలను తీర్చేలా నిర్మించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.
క్రీడాకారులే నిర్వహణలో భాగస్వాములు!
ఖేలో ఇండియా విజయవంతం కావాలంటే ప్రముఖ క్రీడాకారులు, మాజీ అంతర్జాతీయ క్రీడాకారుల భాగస్వామ్యం తప్పనిసరని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి క్రీడా వేదిక బాధ్యతను ప్రముఖ క్రీడాకారులకు అప్పగించి పర్యవేక్షించే ఆలోచన ఉందన్నారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన డిప్యూటీ కలెక్టర్లను నోడల్ అధికారులుగా నియమించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తామని తెలిపారు. వసతి, నాణ్యమైన ఆహారం, తాగునీరు, రవాణా, పరిశుభ్రత, క్రీడా పరికరాల విషయంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని హెచ్చరించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, నిర్లక్ష్యం చేస్తే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌తో పాటు కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో జరిగే పోటీలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సుమారు 7 నుంచి 8 వేల మంది క్రీడాకారులు, కోచ్‌లు, సాంకేతిక సిబ్బందికి అత్యుత్తమ ఆతిథ్యం అందిస్తామని తెలిపారు.
గ్రామీణ ప్రతిభకు జాతీయ వేదిక!
గ్రామీణ ప్రాంతాలు, గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులను ప్రత్యేక బస్సుల్లో క్రీడా వేదికలకు తీసుకువచ్చి పోటీలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పిస్తామని మంత్రి వెల్లడించారు. తద్వారా గ్రామీణ యువతలో క్రీడలపై ఆసక్తి పెంచి దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తామని చెప్పారు. ఇన్వెస్ట్ తెలంగాణ ద్వారా క్రీడా రంగంలో భారీ పెట్టుబడులు ఆకర్షించడం, ఆధునిక శిక్షణ కేంద్రాలు, స్టేడియాలు, స్పోర్ట్స్ సైన్స్ అభివృద్ధి చేయడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రస్తుతం క్రీడా రంగానికి రూ.600 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించామని, ఖేలో ఇండియా విజయంతో భవిష్యత్తులో రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకు నిధులు సాధించేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే క్రీడాకారులను తయారు చేయడమే దీర్ఘకాలిక లక్ష్యమని పేర్కొన్నారు. ప్రముఖ క్రీడాకారుల సూచనల కోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, వారి అనుభవాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తామని తెలిపారు.
దేశానికి తెలంగాణ ఆతిథ్యమే ఆదర్శం!
ఈ సమావేశంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ వీసీ అండ్ ఎండీ సోనిబాలాదేవితో పాటు జె.జె. శోభ, ఈషా సింగ్, అంబటి తిరుపతి రాయుడు, గగన్ నారంగ్, జ్వాలా గుత్తా, నిఖత్ జరీన్, అగసర నందిని తదితర ప్రముఖ క్రీడాకారులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల నుంచి వచ్చే క్రీడాకారులకు తెలంగాణ ఆతిథ్యం చిరస్మరణీయంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తామని మంత్రి తెలిపారు. క్రీడాకారులు కేవలం సలహాలకే పరిమితం కాకుండా పోటీల వేదికలకు వచ్చి యువతను ప్రోత్సహించాలని కోరారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను విజయవంతం చేయడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీల నిర్వహణకు తెలంగాణ సమర్థమైన వేదిక అని నిరూపిస్తామని వాకిటి శ్రీహరి ధీమా వ్యక్తం చేశారు.
#KheloIndiaYouthGames2026 #TelanganaSports #RevanthReddy #VakitiSrihari #HyderabadSports #SportsInfrastructure #Gachibowli #LBSStadium #IndianSports











