మోదీని నిలదీస్తారా? తలవంచి వస్తారా?
సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు సూటి ప్రశ్నలు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు కీలక సవాల్ విసిరారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీని నిలదీసి స్పష్టమైన హామీలు తీసుకువస్తారా? లేక ఎప్పటిలాగే మౌనంగా తిరిగి వస్తారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గోదావరి జలాల విషయంలో చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుని రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీపడకుండా పోరాడారని గుర్తుచేశారు. గోదావరి–కావేరి నదుల అనుసంధానాన్ని ఇచ్చంపల్లి నుంచే చేపట్టాలని, తరలించే 148 టీఎంసీల్లో తెలంగాణకు 50 శాతం వాటా అంటే సుమారు 75 టీఎంసీలు కేటాయించాలని కేంద్రాన్ని ఒప్పించారని పేర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరుగుతోందని విమర్శించారు.
సమ్మక్క–సారక్కకు అనుమతులేవి?
47 టీఎంసీల నీటి వినియోగ సామర్థ్యంతో ప్రతిపాదించిన సమ్మక్క–సారక్క ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర జల సంఘం కొత్త మార్గదర్శకాల పేరుతో వెనక్కి పంపడంపై హరీశ్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు చంద్రబాబు ఒత్తిడితో ఇచ్చంపల్లి మార్గానికి బదులుగా పోలవరం–బనకచర్ల నుంచి నదుల అనుసంధానం చేపట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తెలంగాణకు చట్టబద్ధంగా దక్కాల్సిన 968 టీఎంసీల గోదావరి జలాల వినియోగానికి సంబంధించిన అన్ని ప్రాజెక్టులకు తక్షణమే కేంద్ర అనుమతులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ రూపొందించిన డీపీఆర్ ప్రకారమే గోదావరి–కావేరి అనుసంధానం ఇచ్చంపల్లి నుంచి చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులో తరలించే 148 టీఎంసీల్లో తెలంగాణకు సుమారు 75 టీఎంసీలు కేటాయించాలని, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే పోలవరం–బనకచర్ల అలైన్‌మెంట్‌ను కేంద్రం వద్ద గట్టిగా వ్యతిరేకించాలని సూచించారు.
ఖాళీ చేతులతో వస్తే ఉద్యమమే!
తెలంగాణ నీటి ప్రయోజనాలను తాకట్టు పెట్టి చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గితే రేవంత్ రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి చరిత్రలో బాధ్యత వహించాల్సి వస్తుందని హరీశ్‌రావు హెచ్చరించారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని నుంచి స్పష్టమైన హామీలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. సమ్మక్క–సారక్కకు అనుమతులు, 968 టీఎంసీల వినియోగానికి మార్గం, ఇచ్చంపల్లి నుంచే నదుల అనుసంధానం, 75 టీఎంసీల వాటా విషయంలో స్పష్టత సాధించాల్సిందేనని తేల్చిచెప్పారు. కేవలం ఢిల్లీ పర్యటన చేసి ప్రకటనలతో సరిపెట్టుకోవద్దని హితవు పలికారు. ప్రధాని నుంచి హామీలు తీసుకురాకుండా ఖాళీ చేతులతో తిరిగొస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని ప్రకటించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ కోసం మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని హెచ్చరించారు.
#HarishRao #RevanthReddy #TelanganaWaterRights #GodavariWater #GodavariCauveryLink #SammakkaSarakkaProject #IchampallyProject #PolavaramBanakacherla #BRS #TelanganaPolitics











