Home AP పెట్టుబడులు పెట్టండి ఏపీ కల నిజం చేయండి!

పెట్టుబడులు పెట్టండి ఏపీ కల నిజం చేయండి!

అవకాశాల గని ఆంధ్రప్రదేశ్.
పారిశ్రామికవేత్తలకు పవన్ పిలుపు.

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు పూర్తి భద్రత, ప్రభుత్వ సహకారం అందిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం పెట్టుబడులకు గొప్ప అవకాశాల వేదిక అని పేర్కొన్నారు. “మీ కలతోపాటు ఆంధ్రప్రదేశ్ కలను నిజం చేయడంలో భాగస్వాములు కండి. స్పష్టమైన లక్ష్యంతో పెట్టుబడులు పెట్టండి. ప్రభుత్వం మీకు సొంతిల్లులా అండగా ఉంటుంది” అని పిలుపునిచ్చారు. 1,053 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం, నైపుణ్యం కలిగిన యువత, ప్రతిభావంతమైన మానవ వనరులు ఏపీకి ప్రధాన బలాలని వివరించారు. ఆగ్నేయాసియా దేశాలకు ముఖద్వారంగా ఉన్న రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్నామని, వేగంగా అనుమతులు మంజూరు చేయడం, శాంతిభద్రతలను కాపాడటం ప్రభుత్వ ప్రాధాన్యతలని స్పష్టం చేశారు.

రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం

1995 నుంచి సీఐఐ సదస్సుల ద్వారా ప్రభుత్వం, పారిశ్రామిక రంగం కలిసి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. 2024 సీఐఐ సదస్సులో 714 సంస్థలతో రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని, 19.3 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నామని గుర్తుచేశారు. కాకినాడ ప్రాంతీయ సదస్సులో 15 ఒప్పందాల ద్వారా రూ.4,256 కోట్ల పెట్టుబడులు, 14 వేల ఉద్యోగాల అవకాశాలు వచ్చాయని వివరించారు. ప్రస్తుత సదస్సులో 150 అవగాహన ఒప్పందాల ద్వారా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. పెట్టుబడులు కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పరిశ్రమలు ప్రారంభమై ఉద్యోగాలు కల్పించాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు.

గ్రామీణ ప్రాంతాలకు పారిశ్రామిక వెలుగులు

భారీ పరిశ్రమలతోపాటు చిన్నతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరారు. ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టి స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించాలని పిలుపునిచ్చారు. ఉత్పత్తుల తయారీతోపాటు వినూత్న ఆలోచనలు, పరిశోధన, నైపుణ్యాభివృద్ధిలోనూ పెట్టుబడులు పెట్టాలని సూచించారు. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని, ప్రకృతిని దెబ్బతీయకూడదని పారిశ్రామికవేత్తలకు స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్తును మార్చే పరిశ్రమలు రావాలని, వాటి ఫలితాలు సామాన్య ప్రజల జీవితాల్లో కనిపించాలని ఆకాంక్షించారు. ఈ సదస్సుకు 58 దేశాల నుంచి సుమారు 3,800 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

 

#PawanKalyan #AndhraPradesh #APInvestments #CIIPartnershipSummit2026 #Visakhapatnam #GlobalInvestors #InvestmentOpportunities #ChandrababuNaidu #NaraLokesh #IndustrialDevelopment #MSME #RuralDevelopment #TribalDevelopment #JobOpportunities #SustainableDevelopment