డ్యూటీలోని వైద్యులూ గైర్హాజరా?
కాంగ్రెస్ పాలనపై హరీశ్‌రావు ఫైర్!
సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ.
సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు ఆకస్మిక తనిఖీ నిర్వహించి వైద్యుల గైర్హాజరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎంఓ గదిలో అటెండెన్స్ రిజిస్టర్లు పరిశీలించగా, చాలామంది వైద్యులు సంతకాలు చేసి విధులకు హాజరుకాకపోవడం కనిపించిందని తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటలకే ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, రేడియాలజీ, కంటి విభాగాల్లో సీనియర్ వైద్యులు అందుబాటులో లేరని ఆరోపించారు. 230 మంది రెగ్యులర్ డాక్టర్లు, 88 మంది పీజీ వైద్యులు కలిపి 318 మంది సిబ్బంది ఉన్న ఆసుపత్రిలో 600 పడకలకు కేవలం 301 మంది ఇన్పేషెంట్లే ఉండటంపై ప్రశ్నించారు. “డాక్టర్ల బాధ్యతారాహిత్యం, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య తగ్గుతోంది” అని విమర్శించారు. మెటర్నిటీ, ఆర్థోపెడిక్, చిన్నపిల్లల వార్డులు, ఫార్మసీని పరిశీలించి రోగులతో నేరుగా మాట్లాడారు.
మందుల కొరత.. నిలిచిన శస్త్రచికిత్సలు!
ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందాల్సిన మందులను పేదలు బయట కొనుక్కోవాల్సి వస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు. 500 రకాల మందులు రావాల్సి ఉండగా 200 మాత్రమే అందుబాటులో ఉన్నాయని, 350 నాన్ సర్జికల్ మందుల్లో 160, 150 సర్జికల్ మందుల్లో 70 మాత్రమే ఉన్నాయని వివరించారు. చిన్నపిల్లల వార్డులో 10 వెంటిలేటర్లు ఉన్నా ఒక్కటీ పనిచేయడం లేదని, రోగులకు రూ.1,000 నుంచి రూ.1,500 విలువైన మందులను ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయాలని సూచిస్తున్నారని తెలిపారు. సిద్దిపేట ఆసుపత్రికి మూడేళ్లుగా రూ.30 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, రాష్ట్రవ్యాప్తంగా రూ.1,000 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయని ఆరోపించారు. నిధులు లేక మోకాలి చిప్పల మార్పిడి ఆపరేషన్లకు అవసరమైన ఇంప్లాంట్స్ సరఫరా నిలిచిపోయిందన్నారు. గైనకాలజీ ఆపరేషన్ థియేటర్ పైకప్పు రెండేళ్లుగా కారుతున్నా మరమ్మతులు చేయలేదని, కంటి విభాగంలో అవసరమైన పరికరాలు లేక ఆపరేషన్లు తగ్గాయని పేర్కొన్నారు.
24 గంటల్లోనే ఆపరేషన్.. వైద్యులకు ఆదేశాలు!
కేసీఆర్ హయాంలో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు సిద్దిపేటలో 600 పడకల మెడికల్ కాలేజీ ఆసుపత్రిని ఏర్పాటు చేశామని హరీశ్‌రావు గుర్తుచేశారు. మరోవైపు 1,000 పడకల ఆసుపత్రి నిర్మాణం 90 శాతం పూర్తయినా, మిగిలిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని విమర్శించారు. గర్భిణులకు కేసీఆర్ కిట్, ఆర్థిక సాయం అందడం లేదని రోగులు తన దృష్టికి తెచ్చారని తెలిపారు. ఆర్థోపెడిక్ విభాగంలో 18 మంది వైద్యులు ఉన్నా గత నెలలో 69 మేజర్, 136 మైనర్ ఆపరేషన్లే జరిగాయని, సీటీ స్కాన్ నివేదికలకు మూడు, నాలుగు రోజులు పడుతోందని వివరించారు. తనిఖీ అనంతరం వైద్యులు, అధికారులతో సమీక్ష నిర్వహించి రోగి వచ్చిన 24 గంటల్లో అవసరమైన శస్త్రచికిత్స పూర్తి చేయాలని, వైద్యులంతా ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధుల్లో ఉండాలని ఆదేశించినట్లు చెప్పారు. పెండింగ్ బిల్లులు విడుదల చేసి మందులు, పరికరాల కొరత తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇకపై ప్రతి నెలా ఆసుపత్రి పనితీరును స్వయంగా సమీక్షిస్తానని ప్రకటించారు.
#HarishRao #SiddipetHospital #GovernmentHospital #HospitalInspection #DoctorsAbsence #MedicineShortage #TelanganaHealthcare #BRS #CongressGovernment #Aarogyasri #FreeMedicalTreatment #Siddipet #TelanganaNews #HealthcareIssues











