Home AP పెట్టుబడుల పండుగకు విశాఖ సిద్ధం

పెట్టుబడుల పండుగకు విశాఖ సిద్ధం

ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలకు ఆతిథ్యం.
సాగర తీరాన రెండు రోజులు గ్లోబల్‌ సమ్మిట్‌.

ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో విశాఖపట్నం వేదికగా ఈ నెల 12, 13 తేదీల్లో 31వ సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌–2026 జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు వివిధ దేశాల మంత్రులు, దౌత్యవేత్తలు, పారిశ్రామిక దిగ్గజాలు, బహుళజాతి సంస్థల ప్రతినిధులు హాజరుకానున్నారు. నవంబర్‌ 12న ఉదయం 10.30 గంటలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ప్రారంభమయ్యే సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పాటు జరిగే సమావేశాల్లో పాల్గొని పెట్టుబడిదారులతో చర్చించనున్నారు. గతంలో నిర్వహించిన ఐదు ప్రాంతీయ సదస్సుల ద్వారా రూ.86 వేల కోట్ల పెట్టుబడులు వచ్చిన నేపథ్యంలో, ఈ అంతర్జాతీయ సదస్సుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తయారీ, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాల్లో రాష్ట్ర అవకాశాలను సీఎం వివరించనున్నారు.

ఆరు దేశాల ప్రతినిధులతో కీలక భేటీలు..

సింగపూర్‌, యూఏఈ, జపాన్‌, రష్యా, స్లోవేకియా, గ్వాటెమాల దేశాల ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ప్రపంచ మేధోసంపత్తి సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ డారెన్‌ టాంగ్‌తోనూ చర్చించనున్నారు. కియా మోటార్స్‌, రెన్యూ, మాండెలెజ్‌ ఇండియా, సెయింట్‌ గోబెయిన్‌, నాల్కో, లెవిస్టా వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు సదస్సులో పాల్గొంటారు. హాథోర్‌ రాకెట్స్‌, అగ్నికుల్‌, బెల్లాట్రిక్స్‌ ఏరోస్పేస్‌, స్కైరూట్‌ వంటి అంతరిక్ష రంగ సంస్థలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి స్పేస్‌ టెక్నాలజీ, పరిశోధన, తయారీ రంగాల్లో పెట్టుబడులపై చర్చించనున్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో విశాఖ నోవోటెల్‌లో ‘విమెన్‌ అండ్‌ గ్రోత్‌ సమ్మిట్‌–2026’ నిర్వహించనున్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన, వ్యాపార రంగంలో వారి భాగస్వామ్యం ప్రధాన చర్చాంశాలుగా ఉండనున్నాయి.

కేంద్ర మంత్రులతో వరుస చర్చలు.. పెట్టుబడులే లక్ష్యం!

రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి కేంద్రం నుంచి అవసరమైన సహకారం పొందేందుకు చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. నితిన్‌ గడ్కరీ, పీయూష్‌ గోయల్‌, చిరాగ్‌ పాశ్వాన్‌, ప్రహ్లాద్‌ జోషి, సర్బానంద సోనోవాల్‌తో వివిధ రంగాల అభివృద్ధి, రాష్ట్రానికి అవసరమైన వెసులుబాట్లపై చర్చించనున్నారు. సమ్మిట్‌కు ఒకరోజు ముందుగానే చంద్రబాబు భేటీల కార్యక్రమం ప్రారంభం కానుంది. అమరావతిలో సింగపూర్‌ మంత్రి గాన్‌ సియో హువాంగ్‌తో సమావేశమైన అనంతరం విశాఖ చేరుకుంటారు. డారెన్‌ టాంగ్‌, జపాన్‌ రాయబారి కీచి ఒనో, యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్‌ తౌక్‌ అల్‌ మార్రీ, రెన్యూ సీఈవో సుమంత్‌ సిన్హాతో చర్చిస్తారు. సీఐఐ సీఈవోల సమావేశంతో పాటు అంతర్జాతీయ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలకు ఏర్పాటు చేసిన స్వాగత విందులో పాల్గొంటారు. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించి, ఏపీని పారిశ్రామిక ప్రగతి పథంలో నిలపడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యం.

 

#CIIPartnershipSummit2026 #CIISummit #Visakhapatnam #AndhraPradesh #GlobalInvestors #InvestmentSummit #AmitShah #ChandrababuNaidu #IndustrialDevelopment #ForeignInvestments #APIndustrialGrowth #SpaceTechnology #RenewableEnergy #WomenAndGrowthSummit