బేతుపల్లి చెరువులో రెండు బోట్లు బోల్తా.
సహాయక చర్యలపై సీఎం, మంత్రి సమీక్ష.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి పెద్ద చెరువులో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షాలతో చెరువు అలుగు పారుతుండటంతో చేపలు కొట్టుకుపోకుండా వలలు ఏర్పాటు చేసేందుకు వెళ్లిన ఐదుగురు జాలర్లు వరద ప్రవాహంలో చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు తొలుత ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది బోటులో వెళ్లగా, బోటు మొరాయించడంతో వారూ చిక్కుకుపోయారు. దీంతో కొత్తగూడెం నుంచి ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అదనపు ఫైర్ సిబ్బంది, గైడ్లు మరో రెండు బోట్లలో సహాయక చర్యలకు వెళ్లారు. తొలుత చిక్కుకున్న ముగ్గురు అగ్నిమాపక సిబ్బందిని సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చారు. అనంతరం జాలర్లను రక్షించేందుకు వెళ్లిన రెండు బోట్లు ప్రమాదవశాత్తూ బోల్తాపడ్డాయి. ఈ ఘటనలో 11 మంది ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది గల్లంతయ్యారు.
రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎమ్మెల్యే మట్టా రాగమయి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. భద్రాచలం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించి గల్లంతైన సిబ్బంది కోసం గాలింపు చేపట్టారు. వరద ప్రవాహం కారణంగా సహాయక చర్యలు సవాలుగా మారడంతో డ్రోన్ల ద్వారా లైఫ్ జాకెట్లు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు, చిక్కుకున్న ఐదుగురు జాలర్లు సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం అందింది. గల్లంతైన సిబ్బంది ఆచూకీ కోసం అధికారులు అన్ని మార్గాల్లో ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
క్షేమంగా తీసుకురావడమే లక్ష్యం
ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. గల్లంతైన ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బందిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు సూచించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సైతం ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రక్షణ పరికరాలు, అవసరమైన బోట్లను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌తో నిరంతరం మాట్లాడుతున్నామని, సహాయక చర్యల పురోగతిని సమీక్షిస్తున్నామని తెలిపారు. గల్లంతైన సిబ్బందిని క్షేమంగా బయటకు తీసుకురావడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు గురువారం ఉదయం ఘటనా స్థలానికి వెళ్లనున్నట్లు వెల్లడించారు.
#BethupalliLake #Khammam #BoatCapsize #Sathupalli #SDRF #FireDepartment #NDRF #TelanganaFloods #HeavyRains #RevanthReddy #PonguletiSrinivasReddy #RescueOperations










