Home National_news అగ్నివీరులకు రెండేళ్ల పొడిగింపు

అగ్నివీరులకు రెండేళ్ల పొడిగింపు

యువత అసంతృప్తికి బీజేపీ విరుగుడు.
ఎన్నికల ముందు కేంద్రం కీలక నిర్ణయం.

అగ్నిపథ్ పథకంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులు కేవలం సైనిక నియామకాలకు సంబంధించిన నిర్ణయాలే కాదు.. రాజకీయంగా కూడా కీలక ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అగ్నివీరుల సర్వీసును మరో రెండేళ్లు పొడిగించి, ఆ తర్వాత కూడా సాయుధ దళాల్లో కొనసాగించే అవకాశం కల్పించే ప్రతిపాదన ఈ సమీక్షలో భాగంగా వెలుగులోకి వచ్చింది. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అగ్నిపథ్ విధానంపై సమీక్ష ప్రారంభించింది. ఆ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ కోల్పోయి 240 స్థానాలకే పరిమితమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది. ముఖ్యంగా సైనిక నియామకాలు ఎక్కువగా జరిగే రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురైన నష్టాలు పార్టీ నాయకత్వాన్ని ఆలోచనలో పడేశాయి. యువతలో పెరుగుతున్న అసంతృప్తి ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిందన్న అంచనాలు అగ్నిపథ్ సమీక్షకు ప్రధాన కారణంగా నిలిచాయి.

మిత్రపక్షాల ఒత్తిడితో సమీక్ష

ఎన్నికల ఫలితాల తర్వాత జనతాదళ్ (యునైటెడ్), తెలుగుదేశం పార్టీ, లోక్ జనశక్తి పార్టీ వంటి ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు అగ్నిపథ్ పథకాన్ని పునఃపరిశీలించాలని కేంద్రాన్ని కోరాయి. సైన్యంలో చేరాలని ఆశిస్తున్న యువతలో క్షేత్రస్థాయిలో తీవ్ర అసంతృప్తి ఉందని ఆ పార్టీలు స్పష్టం చేశాయి. 2024 జూన్‌-జులైలో ప్రారంభమైన ఈ సమీక్షలో నియామక విధానంపై వచ్చిన అభ్యంతరాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. అగ్నిపథ్ ద్వారా తక్కువ కాలానికి సైనిక సేవలు అందించడం వల్ల యువతకు అవకాశాలు తగ్గుతున్నాయన్న విమర్శలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి.

ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ వ్యూహం?

అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు తక్కువ వయసున్న, శారీరకంగా దృఢమైన సైనిక బలగాలను తయారుచేయడం, ప్రభుత్వంపై పెరుగుతున్న పెన్షన్ భారాన్ని తగ్గించడం ప్రధాన లక్ష్యాలుగా కేంద్రం ప్రకటించింది. అయితే ఈ వాదనలు రాజకీయంగా యువతను సంతృప్తిపరచలేకపోయాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2029 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పథకంలో మార్పులకు సిద్ధమవుతోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సైనిక నియామక విధానంపై యువతలో విశ్వాసం పెంచడం, ఎన్నికల ముందు అసంతృప్తిని తగ్గించడం బీజేపీ రాజకీయ వ్యూహంలో కీలక అంశాలుగా కనిపిస్తున్నాయి.

 

#AgnipathScheme #Agniveer #AgniveerExtension #IndianArmy #DefenceRecruitment #DefencePolicy #ModiGovernment #BJP #NDA #TDP #JDU #IndianDefence