Home AP రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు

రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు

పాఠశాలల్లోనూ బాలికలకు రక్షణ లేదా?
ప్రభుత్వ వైఫల్యం బయటపడిందన్నజగన్‌.

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థిని గోపికపై జరిగిన దాడి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు. పాఠశాలతో సంబంధం లేని వ్యక్తి ఎలక్ట్రిక్‌ రంపంతో తరగతి గదిలోకి ప్రవేశించి బాలిక గొంతుపై దాడి చేయడం అత్యంత దారుణమన్నారు. పాఠశాలల్లో చదువుకునే చిన్నారులకే రక్షణ లేకపోతే ఇక సామాన్య ప్రజల భద్రతకు భరోసా ఏమిటని ప్రశ్నించారు. ప్రతి గ్రామంలో మద్యం, బెల్ట్‌ షాపులు విచ్చలవిడిగా పెరుగుతున్నాయని, గంజాయి అందుబాటులోకి వస్తోందని ఆరోపించారు. వీటిని అరికట్టాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పోలీసు వ్యవస్థను శాంతిభద్రతల పరిరక్షణకు బదులుగా రాజకీయ అవసరాలకు ఉపయోగిస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు.

రాప్తాడులో వరుస ఘటనలపై ఆందోళన

రాప్తాడు నియోజకవర్గంలో గత 15–16 నెలల్లో తొమ్మిది తీవ్ర ఘటనలు చోటుచేసుకున్నాయని, వాటిలో ఆరు మహిళలు, బాలికలకు సంబంధించినవేనని జగన్‌ పేర్కొన్నారు. గోపికపై దాడితో పాటు అనూష, సావిత్రిబాయి, సావిత్రమ్మలకు సంబంధించిన ఘటనలు, 14 ఏళ్ల ఎస్సీ బాలికపై సామూహిక అత్యాచారం, కురువ లింగయ్య, బోయ నాగేష్‌, నారాయణరెడ్డి హత్యలు, స్పందన ఆత్మహత్య వంటి ఘటనలను ప్రస్తావించారు. ఈ పరిణామాలు రాష్ట్రంలో మహిళలు, బాలికల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. రెడ్‌బుక్‌ పాలన పేరుతో పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు పెంచుతున్నారని ఆరోపించారు. ప్రజల ప్రాణాలకు, ముఖ్యంగా మహిళల భద్రతకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని, మద్యం, గంజాయి అక్రమ విస్తరణను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

మణిపాల్‌ ఆస్పత్రిలో బాలికకు పరామర్శ
రూ.50 లక్షల పరిహారానికి డిమాండ్‌
ఆరోగ్యంపై వైద్యులతో మాట్లాడిన జగన్

రాప్తాడు జడ్పీ హైస్కూల్‌లో దాడికి గురై బెంగళూరులోని మణిపాల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పదో తరగతి విద్యార్థిని గోపికను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. దాదాపు 11 గంటల పాటు సాగిన క్లిష్టమైన శస్త్రచికిత్సను గోపిక తట్టుకుందని, చికిత్సకు స్పందిస్తూ క్రమంగా కోలుకుంటోందని వైద్యులు వివరించినట్లు జగన్‌ తెలిపారు. మరో 48 గంటల పాటు పరిస్థితిని నిశితంగా పరిశీలించాల్సి ఉంటుందని వైద్యులు చెప్పినట్లు వెల్లడించారు. చిన్నారి త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాలికకు జరిగిన ఘటన తీవ్రంగా కలచివేసిందని, ఆమె ఆరోగ్యం మెరుగుపడుతోందన్న సమాచారం కొంత ఊరటనిస్తోందని పేర్కొన్నారు. పరామర్శ అనంతరం ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడిన జగన్‌.. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని కోరారు.

రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలి

గోపికపై దాడికి ప్రభుత్వం బాధ్యత వహించాలని జగన్‌ డిమాండ్‌ చేశారు. పాఠశాలతో సంబంధం లేని వ్యక్తి ఎలక్ట్రిక్‌ రంపంతో లోపలికి వచ్చి బాలికపై దాడి చేసే పరిస్థితి ఎలా ఏర్పడిందని ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం వెంటనే రూ.50 లక్షల పరిహారం అందించాలని, బాలికకు అవసరమైన అత్యుత్తమ వైద్యాన్ని పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో అందించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే వైఎస్సార్‌సీపీ ఆ కుటుంబానికి అండగా నిలుస్తుందని ప్రకటించారు. తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే రూ.50 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. బాలిక వైద్యానికి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. గోపిక పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావాలని ఆకాంక్షించారు. చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సాయం అందించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పాఠశాలల్లో భద్రతా చర్యలు పటిష్ఠం చేయాలని సూచించారు.

 

#YSJagan #AndhraPradesh #LawAndOrder #Rapthadu #GopikaIncident #SchoolSafety #GirlsSafety #WomenSafety #Anantapur #YSRCP #RedBookGovernance #AndhraPradeshPolitics #PoliceSystem