ప్రభుత్వ బ్యాంకులు అమ్మకానికి కాదు.
లాభాల్లోని బ్యాంకులను వదులుకుంటారా?
ఉద్యోగులకు అండగా ఉంటానని వెల్లడి .
ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ నిర్ణయంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. లాభాలు ఆర్జిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకును కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ సంస్థకు విక్రయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ఏడాది మార్చిలో ఐడీబీఐ ఉద్యోగుల బృందం పార్లమెంటులో తనను కలిసి బ్యాంకు అమ్మకం ఎందుకని ప్రశ్నించిందని గుర్తుచేశారు. ఈ అంశాన్ని లోక్‌సభలో ప్రస్తావించి ఉద్యోగులు, ఖాతాదారుల ప్రయోజనాలకు రక్షణ కల్పించాలని కోరినా ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వలేదని ఆరోపించారు. ఏడేళ్ల క్రితం నష్టాల్లో ఉన్న బ్యాంకు గత ఏడాది రూ.9 వేల కోట్లకు పైగా లాభాలు సాధించిందని, ఈ మార్పు వెనుక ఉద్యోగుల కృషి ఉందని ప్రశంసించారు. ప్రజాధనంతో నిర్మించిన బ్యాంకులు ప్రజల ఆస్తులని, వాటిని అమ్మే వస్తువులుగా కాకుండా దేశ నిర్మాణానికి ఉపయోగపడే సంస్థలుగా చూడాలని రాహుల్ పేర్కొన్నారు.
రిజర్వేషన్లు, ఉద్యోగ భద్రతపై ఆందోళన
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసీ కలిపి ఐడీబీఐలో 95 శాతం వాటా కలిగి ఉన్నాయని, విక్రయం తర్వాత వాటి వాటా 34 శాతానికి తగ్గుతుందని రాహుల్ తెలిపారు. 2003లో ఐడీబీఐలో కనీసం 50 శాతం వాటాను ప్రభుత్వం కొనసాగిస్తుందని పార్లమెంటుకు హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఆ హామీని విస్మరించడం ప్రజలకు ఇచ్చిన మాటను తప్పడమేనని విమర్శించారు. బ్యాంకు ప్రైవేటు యాజమాన్యంలోకి వెళితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లకు ముప్పు ఏర్పడుతుందని, ఇప్పటికే బలహీనపడిన ఉద్యోగుల సేవా నిబంధనలకు రక్షణ తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు పూర్తిగా మద్దతు ఇస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ హయాంలో పరిశ్రమల అభివృద్ధి కోసం బ్యాంకులు స్థాపించామని, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో వాటిని విక్రయిస్తున్నారని వ్యాఖ్యానించారు.
రూ.53 వేల కోట్లకు విక్రయ ఒప్పందం
ఐడీబీఐలో 60.72 శాతం వాటాను సుమారు రూ.53 వేల కోట్లకు కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు విక్రయించేందుకు కేంద్రం అక్టోబర్ 14న ఆమోదం తెలిపింది. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 30.48 శాతం వాటా విలువ రూ.26,620 కోట్లు, ఎల్ఐసీకి చెందిన 30.24 శాతం వాటా విలువ రూ.26,440 కోట్లు. ఒక్కో షేరుకు రూ.81 ధర నిర్ణయించగా, స్వతంత్ర సంస్థలు అంచనా వేసిన సరసమైన విలువ రూ.75.99గా ఉంది. రెండో విడత బిడ్డింగ్ ప్రక్రియ నిబంధనల ప్రకారమే జరిగిందని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతులు లభిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి విక్రయం పూర్తయ్యే అవకాశం ఉంది. బ్యాంకు విలువ, ఉద్యోగుల భవిష్యత్తు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై ఈ విక్రయం కొత్త చర్చకు తెరతీసింది.











