పాత ప్రసంగాలతో బీజేపీ కొత్త యుద్ధం
ఈసీ నియామకంపైనా ఎదురుదాడి
నాటి వ్యాఖ్యల వీడియో విడుదల
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని బీజేపీ మరోసారి విమర్శల దాడి ప్రారంభించింది. హిందుత్వం, హిందూ మతం, హిందూ దేవతలపై గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల వీడియోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. ఎన్నికలు సమీపించినప్పుడల్లా హిందువుగా కనిపించేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ఇటీవల సుల్తాన్‌పూర్‌లోని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు 2018లో అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో శివుడికి సంబంధించిన త్రిపుండ్ర తిలకంతో రాహుల్ గాంధీ ఫొటోను పంచుకుంటూ ‘సత్యం శివం సుందరం’ అని పేర్కొనడాన్ని బీజేపీ ప్రస్తావించింది. దీనికి గతంలో హిందుత్వవాదులపై, హిందూ మతంపై ఆయన చేసిన ప్రసంగాల వీడియోలను జతచేసి విమర్శలు గుప్పించింది. దేవాలయాలకు వెళ్లే కొందరు వ్యక్తులే ఇతరులను వేధిస్తున్నారని, హిందుత్వవాదులను ఓడించాలని రాహుల్ గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా ప్రదర్శించింది.
ఎన్నికల కమిషన్ నియామకంపై ప్రశ్నలు
మరోవైపు ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామక విధానంపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. కాంగ్రెస్ పాలనలో ఎన్నికల కమిషనర్ల నియామకానికి ప్రత్యేక చట్టం, ఎంపిక కమిటీ రెండూ లేవని ఆరోపించింది. అప్పట్లో ప్రధానమంత్రి, మంత్రివర్గమే పేర్లను నిర్ణయించేవారని, ప్రతిపక్ష నేతకు సంప్రదింపుల్లో భాగస్వామ్యం ఉండేది కాదని పేర్కొంది. ప్రస్తుతం పారదర్శకమైన వ్యవస్థ అమల్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించింది. ప్రజాస్వామ్యంపై నిజమైన ఆందోళనా? లేక అధికారం కోల్పోయిన అసహనమా? అని రాహుల్ గాంధీని నిలదీసింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టింది.
సర్ వివాదం నేపథ్యంలో రాజకీయ వేడి
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని, ఓటర్ల పేర్లు తొలగిస్తున్నారని కాంగ్రెస్‌తో పాటు ఇతర విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తాజా విమర్శలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒకవైపు రాహుల్ గాంధీ మతపరమైన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం, మరోవైపు ఎన్నికల కమిషన్ నియామక చరిత్రను ముందుకు తెస్తూ విపక్షాల విమర్శలకు సమాధానం చెప్పే వ్యూహంతో బీజేపీ ఎదురుదాడి చేస్తోంది. ఎన్నికల సంఘం విశ్వసనీయత, నియామక విధానం చుట్టూ సాగుతున్న రాజకీయ పోరు మరింత వేడెక్కుతోంది.
#RahulGandhi #BJP #Congress #HinduismRemarks #HindutvaDebate #PoliticalControversy #AmitShah #ElectionCommission #GyaneshKumar #CEAppointment #SIR #IndianPolitics











