ఉద్యోగాలే లక్ష్యంగా పరిశ్రమలకు ఆహ్వానం:భట్టి.
తెలంగాణలో కొరియా సంస్థల పెట్టుబడులను ఆకర్షించి, యువతకు ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, ఔషధాలు, ఆధునిక తయారీ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో కొరియా సంస్థలతో కలిసి పనిచేసేందుకు విస్తృత అవకాశాలున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఆదివారం నిర్వహించిన కె హార్మనీ ఫెస్టా–కొరియా కల్చర్ డే 2026 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2024 ఆగస్టులో సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా జరిగిన పెట్టుబడుల చర్చలు ఇరు ప్రాంతాల ఆర్థిక భాగస్వామ్యానికి పునాది వేశాయని గుర్తుచేశారు. కొరియా అనుభవాల నుంచి నేర్చుకుంటూ సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యమిస్తామని వెల్లడించారు.
పర్యాటకానికి రూ.15 వేల కోట్లు.. మూడు లక్షల ఉద్యోగాలు!
పరిశ్రమలకే పరిమితం కాకుండా పర్యాటక రంగంలోనూ కొరియా పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలుకుతోందని భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ పర్యాటక విధానం 2025–2030 కింద ఐదేళ్లలో రూ.15,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం, మూడు లక్షల అదనపు ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. పర్యాటక మౌలిక సదుపాయాలు, ఆతిథ్య రంగం, చలనచిత్ర పర్యాటకం, వెల్నెస్ టూరిజం, సాంస్కృతిక అనుభవాల అభివృద్ధిలో కొరియా సంస్థల భాగస్వామ్యాన్ని స్వాగతించారు. రాష్ట్రంలోని 27 పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు ఉన్న నేపథ్యంలో ఈ భాగస్వామ్యం కీలకంగా మారనుంది. పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, స్టార్టప్‌లు, చిన్న పరిశ్రమల మధ్య సహకారం పెరగాలని ఆకాంక్షించారు.
సంస్కృతుల కలయిక.. బంధాలకు బలమైన పునాది!
యుద్ధం, పేదరికం వంటి సవాళ్లను అధిగమించి కొరియా ప్రపంచ ఆర్థిక శక్తుల్లో ఒకటిగా ఎదగడం స్ఫూర్తిదాయకమని భట్టి విక్రమార్క కొనియాడారు. కొరియన్ సంగీతం, సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలు ప్రపంచ యువతను ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు. విద్య, కుటుంబ వ్యవస్థ, సంప్రదాయాలు, పెద్దల పట్ల గౌరవం వంటి అంశాల్లో భారత్, కొరియా ప్రజల మధ్య సారూప్యతలున్నాయని చెప్పారు. హైదరాబాద్ బహుళ సంస్కృతులకు నిలయమని, చార్మినార్, గోల్కొండ కోట, రామప్ప దేవాలయం, నాగార్జునసాగర్ బుద్ధవనం వంటి ప్రాంతాలు అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే సామర్థ్యం కలిగి ఉన్నాయని వివరించారు. కొరియా పర్యాటకులు తెలంగాణను సందర్శించాలని, ఇరు ప్రాంతాల యువత విద్య, పరిశోధన, ఉద్యోగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. పెట్టుబడులు, వాణిజ్య ఒప్పందాలతో పాటు ప్రజల మధ్య స్నేహమే సంబంధాలకు శాశ్వత పునాదని స్పష్టం చేశారు. కార్యక్రమానికి భారతదేశంలోని కొరియా రాయబారి లీ సియుంగ్-హో, కొరియా రిపబ్లిక్ హైదరాబాద్ గౌరవ కాన్సుల్ జనరల్ సురేష్ చుక్కపల్లి తదితరులు పాల్గొన్నారు.
#Telangana #SouthKoreanInvestments #BhattiVikramarka #TelanganaInvestments #KoreaCultureDay #KHarmonyFesta2026 #JobCreation #Semiconductors #ElectricVehicles #ElectronicsManufacturing #TelanganaTourism #TourismPolicy #HyderabadNews #IndiaSouthKorea











