Home AP తిరుమలలో వైభవంగా గరుడసేవ

తిరుమలలో వైభవంగా గరుడసేవ

వానలోనూ గోవింద నామస్మరణ!
వర్షాన్ని లెక్కచేయని భక్తజనం.

తిరుమలలో శుక్రవారం కురిసిన వర్షం భక్తుల ఉత్సాహాన్ని ఏమాత్రం తగ్గించలేదు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన గరుడసేవను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం వాతావరణం అనుకూలంగా ఉన్నా, మోహినీ అవతార సేవ సమయానికి మేఘాలు కమ్ముకున్నాయి. రాత్రి వరకు వర్షం కొనసాగినా, భక్తులు నాలుగు మాడ వీధుల్లో గంటల ముందే చేరుకుని వేచి ఉన్నారు. సాయంత్రం 6.30 గంటలకు మలయప్పస్వామి విలువైన ఆభరణాలతో గరుడ వాహనంపై ఊరేగింపుగా బయలుదేరారు. స్వామివారు వీధుల్లో విహరిస్తుండగా భక్తులు ‘గోవిందా.. గోవిందా’ అంటూ భక్తిపారవశ్యంతో స్వాగతం పలికారు. మకరకంఠి, లక్ష్మీ కాసులహారం, వేంకటేశ్వర సహస్రనామ మాల వంటి విశేష ఆభరణాలతో స్వామివారిని అలంకరించారు.

కిక్కిరిసిన గ్యాలరీలు.. విస్తృత ఏర్పాట్లు

నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల సామర్థ్యం దాదాపు 1.8 లక్షల మంది కాగా, అవి భక్తులతో నిండిపోయాయి. లక్ష మందికి పైగా భక్తులకు గ్యాలరీల్లో స్థలం దొరకకపోవడంతో టీటీడీ ఏర్పాటు చేసిన భారీ తెరలపై గరుడసేవను వీక్షించారు. భక్తులకు ఆహారం, తాగునీరు, పానీయాలు అందించారు. రద్దీని నియంత్రించేందుకు నిఘా సిబ్బంది, పోలీసులు భారీగా మోహరించారు. మాడ వీధుల ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో ఆంక్షలతో భక్తులు, స్థానికులు కొంత ఇబ్బంది ఎదుర్కొన్నారు. పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్‌ బొల్లినేని రాజగోపాల్‌ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్రతో పాటు పలువురు అధికారులు గరుడసేవలో పాల్గొన్నారు.

 

#Tirumala #GarudaSeva #NavaratriBrahmotsavams #LordVenkateswara #MalayappaSwamy #TTD #TirumalaTemple #Govinda #TirupatiNews #Devotees #GarudaVahanam #AndhraPradesh