క్షేత్రస్థాయిలో పరిశీలకులదే బాధ్యత
పోటీ చేసే అభ్యర్థులకు అండగా పార్టీ: సజ్జల
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు పూర్తి అండగా నిలవాలని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులకు సూచించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు క్షేత్రస్థాయిలోనే ఉండి అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు ప్రతి అంశాన్ని పర్యవేక్షించాలని ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్లో మాట్లాడిన ఆయన, ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్లు, నామినేషన్లకు తక్కువ సమయం ఉండటంతో అన్ని పనులను సమాంతరంగా చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. ఏ స్థానంలోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థి లేకుండా పోటీ జరగకూడదని, ఏ స్థానం ఏకగ్రీవం కాకూడదని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేసినట్లు వెల్లడించారు. అసెంబ్లీ పరిశీలకులు కోఆర్డినేటర్లు, పార్లమెంట్ పరిశీలకులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, కేంద్ర కార్యాలయం మధ్య అనుసంధానకర్తలుగా పనిచేయాలని సూచించారు. రాబోయే 15–20 రోజులు 24 గంటలూ అందుబాటులో ఉంటూ అంతర్గత విభేదాలు, అభ్యర్థుల ఎంపిక సమస్యలు, ప్రచార లోపాలను వెంటనే పరిష్కరించాలని చెప్పారు.
నామినేషన్లకు ఆటంకాలు లేకుండా చూడాలి
అభ్యర్థులకు నామినేషన్ విధానం, ఎన్నికల నిబంధనలు, న్యాయపరమైన అంశాలు, మీడియా ప్రచారం, డిజిటల్ ప్రచారంపై అవసరమైన సహకారం అందించాలని సజ్జల సూచించారు. కుల ధ్రువీకరణ పత్రాలు, బకాయిలు లేవన్న ధ్రువపత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని, ఆలస్యం జరిగితే కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలని చెప్పారు. అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణలో ఉద్దేశపూర్వక జాప్యం, పత్రాల తిరస్కరణ వంటి సమస్యలు ఎదురైతే వెంటనే స్పందించాలని, ప్రతి ఘటనకు వీడియో ఆధారాలు భద్రపరచాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలు, సీసీ కెమెరాలు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను ముందుగానే పరిశీలించి లోపాలుంటే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. అభ్యర్థుల ఇంటింటి ప్రచారం, మీడియా కవరేజ్, సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని కూడా పర్యవేక్షించాలన్నారు. కేంద్ర కార్యాలయం ద్వారా రోజువారీ నివేదికల వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
ప్రచారం నుంచి పోలింగ్ వరకు నిఘా
స్థానిక సమస్యలు, ప్రజల ఇబ్బందులు, గత ప్రభుత్వంలో చేపట్టిన పనులు, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను డిజిటల్ మాధ్యమాల ద్వారా వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సజ్జల సూచించారు. అవసరమైనప్పుడు పార్టీ లీగల్ సెల్, మీడియా విభాగాలను నేరుగా సంప్రదించి సహాయం పొందాలని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించి, అనుమానాస్పద పరిస్థితులపై వెంటనే ఫిర్యాదు చేయాలని చెప్పారు. అభ్యర్థులకు భరోసా కల్పించడం, సమస్యలను పరిష్కరించడం, కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేయడం పరిశీలకుల పనితీరుకు ప్రధాన ప్రమాణాలుగా ఉంటాయని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలను కోఆర్డినేటర్లతో పాటు పరిశీలకులకు కూడా పరీక్షగా భావించాలని పేర్కొన్నారు. ప్రతి సమస్యను గుర్తించి, పరిష్కారాన్ని వేగంగా అమలు చేసే విధంగా పనిచేయాలని, ఈ ఆదేశాలను వైఎస్ జగన్ సందేశంగా పరిగణించాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.
#YSRCP #SajjalaRamakrishnaReddy #YSJaganMohanReddy #APLocalBodyElections #LocalBodyElections2026 #AndhraPradeshPolitics #YSRCPCandidates #ElectionStrategy #MunicipalElections #ElectionObservers #APPoliticalNews #PoliticalCampaign











