Home AP జగన్ కుటుంబ సభ్యులపై సైబర్ దాడులా?

జగన్ కుటుంబ సభ్యులపై సైబర్ దాడులా?

జనసేన కార్యకర్తలపై చర్యలకు వైసీపీ డిమాండ్‌.

వైఎస్‌ జగన్‌ కుటుంబ సభ్యులపై జనసేన కార్యకర్తలు సోషల్‌ మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నా కూటమి నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాకాణి పూజిత ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై మహిళా నాయకులతో కలిసి వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎక్స్‌ స్పేస్‌లలో జరిగిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలు, పాల్గొన్నవారి వివరాలను పోలీసులకు అందజేసినట్లు తెలిపారు. రాజకీయ విమర్శలు చేయడం వేరు.. రాజకీయాలతో సంబంధంలేని కుటుంబ సభ్యులను దూషించడం వేరని ఆమె స్పష్టం చేశారు. ఇలాంటి సైబర్‌ వేధింపులు మహిళలు, యువత, చిన్నారులపై తీవ్ర మానసిక ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

చంద్రబాబు, పవన్‌ స్పందించాలని డిమాండ్‌

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్, హోంమంత్రి అనిత ఈ ఘటనపై స్పందించాలని కాకాణి పూజిత కోరారు. జనసేనకు చెందినవారే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే వారిని నియంత్రించి చర్యలు తీసుకోవాలని, లేదంటే పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేయాలని అన్నారు. ఫిర్యాదుతో సరిపెట్టకుండా పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్‌ చేశారు. సోషల్‌ మీడియాను వ్యక్తిత్వ హననానికి వాడుకునే వారిని ఉపేక్షించకూడదని, మహిళల గౌరవాన్ని కాపాడేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ సైబర్‌ వేధింపులను ఖండించాలని పిలుపునిచ్చారు.

 

#YSJagan #YSRCP #JanaSena #KakaniPoojitha #CyberHarassment #SocialMediaAbuse #AndhraPradeshPolitics #PawanKalyan #ChandrababuNaidu #CyberCrime