పెండింగ్ ఎన్నికల బిల్లులు చెల్లించండి!
సీఈవోకు డిప్యూటీ కలెక్టర్ల సంఘం వినతి.
ఎన్నికల నిర్వహణ ఖర్చులు చెల్లించకపోవడంతో అధికారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు (ఏఆర్వోలు) చేసిన ఖర్చులు కేటాయించిన బడ్జెట్‌ను మించాయని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. లచ్చిరెడ్డి తెలిపారు. గురువారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డిని కలిసి పెండింగ్ బిల్లులు, అదనపు ఖర్చుల చెల్లింపులపై వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల నిర్వహణకు కేటాయించిన నిధులు సరిపోకపోవడంతో పలువురు అధికారులు వ్యక్తిగతంగా అప్పులు తెచ్చి ఖర్చులు భరించాల్సి వచ్చిందని వివరించారు. ఆ ఖర్చులకు సంబంధించిన బిల్లులు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయని పేర్కొన్నారు.
అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు.. గౌరవానికి భంగం
బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా అప్పులిచ్చిన కొందరు వ్యక్తులు కోర్టులను ఆశ్రయిస్తుండగా, మరికొందరు మాజీ ఆర్వోలు, ఏఆర్వోల ఇళ్లకు, కార్యాలయాలకు వెళ్లి డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని లచ్చిరెడ్డి వెల్లడించారు. దీంతో అధికారులు ఆర్థిక ఇబ్బందులతో పాటు వ్యక్తిగత గౌరవం, వృత్తిపరమైన ప్రతిష్ఠకు భంగం కలిగే పరిస్థితి ఏర్పడిందన్నారు. అదనపు బడ్జెట్ కోసం సంబంధిత అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు పంపినా అవి వివిధ స్థాయుల్లో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. నాంపల్లి అసెంబ్లీ, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాల అదనపు ఖర్చుల ప్రతిపాదనలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. పెండింగ్ బిల్లులను పరిశీలించి, అదనపు నిధులు మంజూరు చేసి వెంటనే చెల్లింపులు చేపట్టాలని సీఈవోను సంఘం కోరింది.
#Telangana #DeputyCollectors #PendingElectionBills #ElectionExpenses #TelanganaElections #CEOTelangana #ReturningOfficers #AssemblyElections2023 #LokSabhaElections2024 #Malkajgiri #Nampally











