ముఖాముఖి చర్చకు సై.
ప్రధానిపై రాహుల్ విమర్శలు.
ప్రధాని నరేంద్ర మోదీకి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. కాంగ్రెస్‌ను దేశ విరోధి పార్టీగా అభివర్ణిస్తున్న మోదీ, తనతో ముఖాముఖి చర్చకు రావాలని డిమాండ్ చేశారు. తాను కేవలం ఐదు నిమిషాల్లోనే మోదీ దేశ విరోధి అని నిరూపిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతూ నవంబర్ 4న నిర్వహించిన కాంగ్రెస్ ఇన్సాఫ్ ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చర్చకు వేదిక ఎక్కడైనా సిద్ధమేనని, న్యాయనిర్ణేతగా ఎవరిని నియమించుకోవాలన్నది కూడా మోదీ ఇష్టమని అన్నారు. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్‌ను పెట్టుకున్నా, పారిశ్రామికవేత్త అదానీని కూర్చోబెట్టినా తనకు అభ్యంతరం లేదన్నారు. మోదీ తన ఎదుట కూర్చొని చర్చకు సిద్ధపడితే ఎవరు దేశ విరోధులో ప్రజలకే తెలుస్తుందని సవాల్ విసిరారు.
అదానీ కోసం దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టారా?
మోదీ ప్రభుత్వం సామాన్య ప్రజల కోసం కాకుండా బడా పారిశ్రామికవేత్త అదానీ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని రాహుల్ ఆరోపించారు. దేశంలోని భూములు, మౌలిక సదుపాయాలు, విమానాశ్రయాలను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని విమర్శించారు. రైతులు, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రయోజనాలను పట్టించుకోవడం లేదన్నారు. అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. కేబినెట్‌తో పాటు అధికారులతో చర్చించకుండానే ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి ఒప్పందంపై సంతకం చేశారని ఆరోపించారు. భారత రైతులు, పరిశ్రమలు, దేశ డేటా ప్రయోజనాలను అమెరికాకు అప్పగించారని విమర్శించారు. గతంలో భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ చెబుతున్నా, మోదీ ఖండించలేకపోతున్నారని అన్నారు. అమెరికాలో అదానీపై ఉన్న కేసు వాణిజ్య ఒప్పందం తర్వాత ముగిసిందని కూడా రాహుల్ ఆరోపించారు.
పార్లమెంటులో మైక్ కట్‌పై ఆగ్రహం
బీజేపీ ప్రతిపాదిస్తున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో ఎస్ఐఆర్పై చర్చకు సిద్ధమన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనపైనా రాహుల్ స్పందించారు. పార్లమెంట్లో చర్చకు ఆహ్వానిస్తున్నారని, కానీ సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మైక్ నిలిపివేస్తున్నారని విమర్శించారు. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా చర్చకు పిలవడంలో అర్థం లేదన్నారు. మోదీ తనతో నేరుగా చర్చకు రావడానికి సిద్ధంగా లేరని ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభావంలో మోదీ పనిచేస్తున్నారన్నది తన ప్రధాన ఆరోపణగా పేర్కొన్నారు. మొత్తంగా పంజాబ్ ఎన్నికల ప్రచార వేదికగా రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై వ్యక్తిగత విమర్శలతో పాటు అమెరికా ఒప్పందం, అదానీ వ్యవహారాలను ప్రస్తావిస్తూ రాజకీయ దాడిని తీవ్రతరం చేశారు.
#RahulGandhi #NarendraModi #Congress #InsaafRally #PunjabPolitics #Adani #IndiaUSTradeDeal #DonaldTrump #AmitShah #IndianPolitics











