వారసుడిపై బోర్డ్ ఫోకస్.
టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 2027 ఫిబ్రవరి 20 వరకు పదవీకాలం ఉన్నప్పటికీ.. దాదాపు ఆరు నెలల ముందే తప్పుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆగస్టు 18న టాటా సన్స్ వార్షిక సర్వసభ్య సమావేశం జరగనున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.
40 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు
టాటా గ్రూప్‌లో దాదాపు 40 ఏళ్ల వృత్తి జీవితాన్ని పూర్తి చేసుకున్నానని చంద్రశేఖరన్ తెలిపారు. ప్రతిష్ఠాత్మక సంస్థకు సేవలందించే అవకాశం లభించడం సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. గత పదేళ్లుగా టాటా సన్స్‌కు నాయకత్వం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు. చైర్మన్‌గా కొనసాగడం అపారమైన బాధ్యతగా అభివర్ణించిన ఆయన.. సంస్థ భవిష్యత్ కోసం వారసత్వంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని బోర్డును కోరారు.
వారసుడిపై ఆసక్తి.. షేర్లపై ప్రభావం
చంద్రశేఖరన్ 2017లో టాటా సన్స్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. టాటా సన్స్ చైర్మన్‌గా ఆయన కొనసాగింపుపై టాటా సన్స్, టాటా ట్రస్టుల మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే రాజీనామా నిర్ణయం వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన తప్పుకోవడంతో టాటా గ్రూప్ షేర్లపై కూడా ప్రభావం కనిపించింది. సంస్థ షేర్లు దాదాపు 5 శాతం వరకు పడిపోయాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్, టీసీఎస్, ఇండియన్ హోటల్స్ వంటి కీలక సంస్థలకు నాయకత్వం వహించిన చంద్రశేఖరన్ నిష్క్రమణ తర్వాత తదుపరి చైర్మన్ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది.
#NChandrasekaran #TataSons #TataGroup #TataSonsChairman #ChandrasekaranResigns #TataGroupLeadership #TataSuccession #TataSonsSuccessor #TataTrusts #TataShares #TataSteel #TataMotors #TCS #IndianHotels #TataAGM #BusinessNews #CorporateNews











