Home Inter National News హద్దుల్లో ఉండాల్సిందే చైనా అధ్యక్షుడికి మోదీ క్లారిటీ

హద్దుల్లో ఉండాల్సిందే చైనా అధ్యక్షుడికి మోదీ క్లారిటీ

భారత్‌–చైనా బంధానికి శాంతి కీలకం.

ఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ద్వైపాక్షిక భేటీ కీలకంగా మారింది. ఏడు సంవత్సరాల తర్వాత జిన్‌పింగ్‌ భారత్‌లో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరుదేశాల మధ్య సరిహద్దు సమస్య, వాణిజ్యం, పెట్టుబడులు, ద్వైపాక్షిక సంబంధాలపై నేతలు విస్తృతంగా చర్చించారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతత కొనసాగితేనే భారత్‌–చైనా సంబంధాలు మరింత ముందుకు సాగుతాయని మోదీ స్పష్టం చేశారు. ఇప్పటికే కుదిరిన ఒప్పందాలు, పరస్పర అవగాహనలను ఇరుపక్షాలు గౌరవించాలని ఆయన సూచించారు. సరిహద్దు వివాదానికి న్యాయమైన, సహేతుకమైన, ఇరుదేశాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనే దిశగా కృషి చేయాలని ఇద్దరు నేతలు అంగీకరించారు.

భేదాలు వివాదాలుగా మారొద్దు

విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, 2025 ఆగస్టులో టియాంజిన్‌లో జరిగిన సమావేశం తర్వాత భారత్‌–చైనా సంబంధాల్లో స్థిరమైన పురోగతి కనిపించిందని ఇరువురు నేతలు గుర్తించారు. “భేదాలు వివాదాలుగా మారకూడదు” అన్న వైఖరిని మోదీ మరోసారి స్పష్టం చేశారు. పరస్పర గౌరవం, పరస్పర సున్నితత్వం, పరస్పర ప్రయోజనం అనే మూడు అంశాల ఆధారంగా సంబంధాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. మరోవైపు జిన్‌పింగ్‌ మాట్లాడుతూ భారత్‌, చైనా ఒకరి బలాలను మరొకరు నేర్చుకుని పరస్పరం సహకరించుకోవచ్చని అన్నారు. తన పుట్టినరోజైన జూన్‌ 15న భారత్‌ పర్యటనకు ఆహ్వానం అందుకోవడం గుర్తుండిపోయే విషయమని పేర్కొన్నారు. మోదీతో ఇప్పటివరకు 21 సార్లు సమావేశమై కీలక అవగాహనలకు వచ్చినట్లు తెలిపారు. ఇరుదేశాలు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలు, గ్లోబల్‌ సౌత్‌లో కీలక భాగస్వాములుగా కలిసి పనిచేయాల్సిన బాధ్యత ఉందన్నారు.

సరిహద్దు నుంచి వ్యూహాత్మక భాగస్వామ్యానికి

మోదీ–జిన్‌పింగ్‌ భేటీలో ఇరుదేశాల సంబంధాలను మరింత విస్తరించేందుకు కొత్త చర్యలను పరిశీలించారు. వాణిజ్యం, పెట్టుబడులు సహా వివిధ రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచే అవకాశాలపై చర్చ జరిగింది. చైనా వచ్చే ఏడాది బ్రిక్స్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఆ దేశానికి మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో సరిహద్దు శాంతి అంశాన్ని భారత్‌ అత్యంత కీలకంగా ముందుకు తెచ్చింది. ఇటీవల జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ మధ్య ప్రత్యేక ప్రతినిధుల చర్చలు కూడా జరిగాయి. 3,488 కిలోమీటర్ల సరిహద్దు వివాదానికి పరిష్కారం, వాస్తవ నియంత్రణ రేఖ వద్ద శాంతి, సరిహద్దు నిర్ధారణ వంటి అంశాలు ఆ చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. మొత్తం మీద మోదీ–జిన్‌పింగ్‌ భేటీతో భారత్‌–చైనా సంబంధాల్లో సహకారానికి తలుపులు తెరుచుకుంటున్నా, సరిహద్దు శాంతి, పరస్పర విశ్వాసమే భవిష్యత్‌ బంధానికి అసలు పరీక్షగా నిలిచింది.

#NarendraModi #XiJinping #ModiXiMeeting #ModiXi #IndiaChinaRelations #IndiaChina #IndiaChinaBorder #BorderPeace #LAC #IndiaChinaBorderDispute #BRICS2026 #BRICSSummit #IndiaChinaTrade #IndiaChinaDiplomacy #IndiaForeignPolicy #ChinaIndiaRelations #GlobalSouth #StrategicRelations #ModiNews #XiJinpingIndiaVisit