మెగావర్స్తో నెట్‌ఫ్లిక్స్‌లో సందడి!
నవ్వులు, ముచ్చట్లతో మెగా వినోదం!
వెండితెరపై తనదైన స్టైల్‌తో కోట్లాది అభిమానులను ఉర్రూతలూగించిన మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు ఓటీటీ వేదికపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు! చాలాకాలంగా ఎదురుచూస్తున్న చిరంజీవి టాక్ షోకు ఎట్టకేలకు తెరలేచింది. ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించిన ఈ కార్యక్రమానికి ‘మెగావర్స్’ అనే ఆసక్తికరమైన పేరు పెట్టింది. టాలీవుడ్లో టాక్ షోలకు ఇప్పటికే మంచి ఆదరణ ఉండగా.. బాలకృష్ణ, జగపతిబాబు వంటి సీనియర్ హీరోలు ఈ ఫార్మాట్లో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు మెగాస్టార్ రంగంలోకి దిగడంతో ఈ షోపై అంచనాలు మరింత పెరిగాయి. గతంలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ నాలుగో సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన చిరంజీవికి హోస్టింగ్ కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆయనతో కబుర్లు, సరదా సంభాషణలు, సినీ జ్ఞాపకాలు పంచుకునే అతిథులు ఎవరన్నదే అభిమానుల్లో అసలు ఆసక్తి! ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైనట్లు సమాచారం. తొలి ఎపిసోడ్లో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, సునీల్, సత్య పాల్గొన్నట్లు తెలుస్తోంది. వీరి కలయికతో మెగావర్స్లో నవ్వుల జాతర ఏ స్థాయిలో ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. మరికొందరు ప్రముఖ సినీ తారలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిరంజీవి తనదైన చమత్కారంతో అతిథులను ఆటపట్టిస్తూ, ఆసక్తికరమైన ప్రశ్నలతో వారి జీవితంలోని తెలియని కోణాలను బయటపెడితే అభిమానులకు పండగే! మెగాస్టార్ హోస్టింగ్‌లో తెరకెక్కుతున్న ఈ వినోదాల వేదిక ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందన్న విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ త్వరలో వెల్లడించనుంది. బాస్ తెరపై కనిపిస్తేనే సందడి.. మరి మాటల మాయాజాలంతో మెగావర్స్లోకి వస్తే వినోదం ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి!
#Chiranjeevi #Megastar #Megaverse #Netflix #ChiranjeeviTalkShow #OTT #TeluguOTT #Brahmanandam #Sunil #Satya #TeluguEntertainment #TeluguCinema #CelebrityTalkShow #OTTUpdates











