భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భవిష్యత్‌పై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైభవ్ కేవలం టీ20లకే సరిపోయే ఆటగాడన్న అభిప్రాయంతో తాను ఏకీభవించనని స్పష్టం చేశారు. సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ రాణించే సత్తా అతడికి ఉందని తెలిపారు. 15 ఏళ్ల వయసులోనే భారీ ఒత్తిడి ఉండే ఐపీఎల్‌లో ధైర్యంగా ఆడి తన ప్రతిభను నిరూపించుకున్న తీరు ఆకట్టుకుందని హెడెన్ ప్రశంసించారు. మానసిక బలం, ప్రతిభ అతడి ప్రధాన ఆయుధాలని పేర్కొన్నారు. 2026 ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ అద్భుత ప్రదర్శన చేశాడు. 776 పరుగులు సాధించి టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. 237.30 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసిన అతడు ఒక సెంచరీ, ఐదు అర్ధసెంచరీలు నమోదు చేశాడు. ఒకే సీజన్‌లో 72 సిక్సర్లు బాదిన వైభవ్ కొత్త రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వైభవ్.. జింబాబ్వేతో మూడు టీ20ల్లో 151 పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. అండర్-19 ప్రపంచకప్‌లో 439 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. అయితే అత్యున్నత స్థాయిలో ఇంకా నేర్చుకోవాల్సింది ఉందని హెడెన్ చెప్పారు. ఫిట్‌నెస్‌తో పాటు మానసిక దృఢత్వంపై దృష్టి పెడితే సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ ప్రపంచస్థాయి ఆటగాడిగా ఎదిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
#VaibhavSuryavanshi #MatthewHayden #VaibhavSuryavanshiFuture #IPL2026 #RajasthanRoyals #TeamIndia #IndianCricket #T20Cricket #TestCricket #LongFormat #VaibhavSuryavanshiRecords #CricketNews #YoungCricketer #IndiaCricket











