Home Naadesam_Special ఏపీలో క్రాప్‌ హాలిడే లేదు తెలంగాణలో ఎందుకు?

ఏపీలో క్రాప్‌ హాలిడే లేదు తెలంగాణలో ఎందుకు?

కరువు బాధ్యత కాంగ్రెస్‌దే!

తెలంగాణలో పంటల సాగుకు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతుంటే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం క్రాప్‌ హాలిడే పరిస్థితి లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్‌ తెచ్చిన కరువు అంటూ మండిపడ్డారు. ఏపీలో పట్టిసీమ మోటార్లను 100 రోజులపాటు 24 గంటలూ నడిపి గోదావరి, కృష్ణా డెల్టాలకు నీరు అందించారని పేర్కొన్నారు. తెలంగాణలోనూ గోదావరిపై సమ్మక్క బ్యారేజీ నిర్మాణం, దేవాదుల మూడో దశ అందుబాటులో ఉన్నప్పటికీ రైతులకు నీరు ఎందుకు అందించలేదని ప్రశ్నించారు.

మోటార్ల లెక్కలపై శ్వేతపత్రం విడుదల చేయాలి

దేవాదుల, కల్వకుర్తి ప్రాజెక్టుల మోటార్లను ప్రభుత్వం ఎన్ని రోజులు నడిపింది? రోజుకు ఎన్ని గంటలు నీటిని ఎత్తిపోసింది? మొత్తం ఎంత నీరు వినియోగించింది? అనే వివరాలతో ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. తెలంగాణ అవసరాలకు నీటిని వినియోగించిన తర్వాతే దిగువకు నీరు వెళ్లాలని, అలాంటప్పుడు ఏపీకి నిరంతరాయంగా నీరు ఎలా అందించారని ప్రశ్నించారు. ఎల్‌నినో పేరుతో ప్రజలను భయపెట్టడం తప్ప, రైతులకు నీరు అందించేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు.

గ్రావిటీ నీళ్లపై బహిరంగ సవాల్‌

తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీరు వస్తుందని కాంగ్రెస్‌ ప్రభుత్వం చెబుతున్న మాటలు అబద్ధమని హరీశ్‌రావు ఆరోపించారు. ఈ వాదనను నిరూపించాలని ప్రభుత్వానికి బహిరంగ సవాల్‌ విసిరారు. గ్రావిటీ ద్వారా నీరు వస్తుందని నిరూపిస్తే తాను రాజీనామా చేసి వెళ్లిపోతానని, నిరూపించలేకపోతే ప్రభుత్వం రాజీనామా చేస్తుందా? అని ప్రశ్నించారు. తెలంగాణ రైతులకు సాగునీరు అందించడంలో వైఫల్యానికి కాంగ్రెస్‌ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, ప్రాజెక్టుల నిర్వహణ వివరాలను ప్రజల ముందుంచాలని హరీశ్‌రావు కోరారు.

#HarishRao #Telangana #BRS #CropHoliday #TelanganaFarmers #RevanthReddy #CongressGovernment #IrrigationWater #Pattiseema #Devadula #Kalwakurthy #Thummidihatti #Yellampalli #TelanganaPolitics