Home AP సుప్రీం తీర్పు తర్వాత స్థానిక పోరు

సుప్రీం తీర్పు తర్వాత స్థానిక పోరు

ఎన్నికలకు యంత్రాంగం సిద్ధం.
స్టేట్ ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా.

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు. గత రెండు నెలలుగా ఎన్నికల ఏర్పాట్లపై అధికారులు కసరత్తు చేస్తున్నారని, అవసరమైన చర్యలను ఇప్పటికే చేపట్టారని తెలిపారు. దీంతో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రక్రియ వేగం పుంజుకునే అవకాశం కనిపిస్తోంది.

బ్యాలెట్‌ విధానంలోనే ఎన్నికలు

స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. 2026 ఫిబ్రవరి 5న ప్రచురించిన ఫొటో ఓటర్ల జాబితానే ఎన్నికలకు ప్రామాణికంగా తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన బ్యాలెట్ పేపర్ల ముద్రణ కోసం అవసరమైన ప్రింటింగ్ ప్రెస్‌ను కూడా త్వరలో ఖరారు చేయనున్నట్లు తెలిపారు. కలెక్టర్లు, పోలీసు అధికారులు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేస్తున్నారని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. దీంతో స్థానిక ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు సుప్రీం తీర్పుతోనే తెరపడనుంది.

 

#AndhraPradesh #LocalBodyElections #AnilChandraPunetha #StateElectionCommission #SupremeCourt #APElections #BallotPaperVoting #VoterList #ElectionPreparedness #APPolitics #AndhraPradeshNews