Home Educational_News లెక్కలు రావడం లేదు ఏఐతో చిన్నారులకు తిప్పలు

లెక్కలు రావడం లేదు ఏఐతో చిన్నారులకు తిప్పలు

ఐనా డోంట్ కేర్, బెంగపడొద్దు.
ఎన్విడియా సీఈఓ రియాల్టీ చెక్ .

ఏఐ సాధనాలపై ఆధారపడటం వల్ల పిల్లలు ప్రాథమిక గణిత నైపుణ్యాలను మరిచిపోతున్నా పెద్దగా ఆందోళన అవసరం లేదని ఎన్విడియా సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌ అభిప్రాయపడ్డారు. ది ఎజ్రా క్లెయిన్‌ షోలో మాట్లాడుతూ, ప్రస్తుతం పిల్లలు లాంగ్‌ డివిజన్‌, గుణకార పట్టికలు, స్క్వేర్‌ రూట్స్‌ వంటి ప్రాథమిక లెక్కలను మునుపటిలా సాధన చేయడం లేదన్నారు. చైనాలో 26 వేల మంది విద్యార్థులపై జరిగిన ఓ అధ్యయనంలో ఏఐతో హోంవర్క్‌ వేగంగా పూర్తయినా, ఆరు నెలల్లో పరీక్షల మార్కులు 20 శాతం వరకు తగ్గినట్లు నివేదికలు పేర్కొన్నాయని చర్చలో ప్రస్తావించారు. అయినా ఏఐ ఆధారిత భవిష్యత్తులో కొన్ని పాత నైపుణ్యాలు అంత ముఖ్యమైనవి కాకపోవచ్చని హువాంగ్‌ అన్నారు.

కొత్త నైపుణ్యాలు పుట్టుకొస్తాయన్న హువాంగ్‌

పిల్లలు కొన్ని ప్రాథమిక నైపుణ్యాలను కోల్పోయినా, వాటి స్థానంలో మరింత ఉపయోగకరమైన కొత్త సామర్థ్యాలు అభివృద్ధి చెందవచ్చని హువాంగ్‌ అభిప్రాయపడ్డారు. సూక్ష్మమైన మేధో నైపుణ్యాలు కొంత తగ్గినా, పెద్ద వ్యవస్థలను అర్థం చేసుకునే ‘సిస్టమ్‌ థింకింగ్‌’ పెరగవచ్చని చెప్పారు. తన విషయాన్ని వివరిస్తూ తన ఇంటి చిరునామా, జిప్‌కోడ్‌, ఫోన్‌ నంబర్‌ కూడా తనకు గుర్తుండవని వ్యక్తిగత ఉదాహరణలు చెప్పారు. అవసరమైన సమాచారాన్ని ఇతరులు లేదా సాంకేతిక సాధనాలు అందిస్తున్నప్పుడు ప్రతి విషయం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నది ఆయన వాదన.

ఏఐ ఆధారపడటంపై తీవ్ర చర్చ

అయితే హువాంగ్‌ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చ మొదలైంది. పిల్లలు ప్రాథమిక గణితం నేర్చుకోకపోతే ఏఐ సాధనాలపై మరింత ఆధారపడే ప్రమాదం ఉందని కొందరు విమర్శించారు. సాంకేతిక సంస్థల ఉత్పత్తులపై ప్రజలను ఎక్కువగా ఆధారపడేలా చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఏఐ వల్ల స్వతంత్ర ఆలోచన తగ్గుతుందా, వ్యక్తిగత నిర్ణయ సామర్థ్యం ప్రభావితమవుతుందా అన్న అంశాలపై ఇప్పటికే పలు అధ్యయనాలు జరుగుతున్నాయి. మరోవైపు ఏఐ కొత్త తరహా ఆలోచనా సామర్థ్యాలను పెంచగలదనే వాదన కూడా ఉంది. ప్రాథమిక నైపుణ్యాలను పూర్తిగా వదిలేయాలా, ఏఐతో కలిసి వాటిని ఉపయోగించాలా అన్న ప్రశ్న ఇప్పుడు విద్యారంగంలో కీలక చర్చగా మారుతోంది.

 

#JensenHuang #Nvidia #ArtificialIntelligence #AI #AIInEducation #KidsAndAI #MathSkills #Education #AIHomework #StudentLearning #BasicMath #SystemThinking #AIImpact #FutureOfEducation #TechNews