Home Telangana ఈసీపై పోరు.. దేశవ్యాప్తంగా నిరసనలు

ఈసీపై పోరు.. దేశవ్యాప్తంగా నిరసనలు

జ్ఞానేశ్‌ రాజీనామాకు కాంగ్రెస్‌ పిలుపు.

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఢిల్లీ, పట్నా, కోల్‌కతా, జమ్మూ, అసోం, ఒడిశా, మేఘాలయ, హిమాచల్‌ప్రదేశ్‌ సహా పలు ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలు ఎన్నికల సంఘం కార్యాలయాల వైపు ర్యాలీలు నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై స్వతంత్ర సమీక్ష చేపట్టాలని, సీఈసీపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ఢిల్లీలో ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద భారీగా పోలీసులు, పారామిలటరీ బలగాలను మోహరించారు. అసోంలో కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగోయ్‌ సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్నాలో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్‌ కేనన్లు ఉపయోగించారు.

జంతర్‌మంతర్‌ వద్ద పలువురు అరెస్ట్‌

ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ అరెస్టు, రాజీనామా కోరుతూ ఏఐఎస్‌ఏ నిర్వహించిన ఆందోళనలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏఐఎస్‌ఏ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా, సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య, కార్యకర్త యోగేంద్ర యాదవ్‌ తదితరులు అదుపులోకి తీసుకున్న వారిలో ఉన్నారు. ఢిల్లీ పోలీసుల ప్రకారం సుమారు 40–50 మందిని అదుపులోకి తీసుకున్నారు. జంతర్‌మంతర్‌ వద్ద నిరసనకు ముందస్తు అనుమతి తీసుకోలేదని పోలీసులు తెలిపారు. నిరసనకారులను తరువాత విడుదల చేసినట్లు కూడా అధికారులు పేర్కొన్నారు. మరోవైపు పోలీసుల చర్యపై ఆందోళనకారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

14 అభ్యంతరాలతో దుమారం

ఈ ఆందోళనలకు ప్రధాన నేపథ్యం ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలపై వచ్చిన ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ నివేదిక. ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషి పది నెలల వ్యవధిలో కనీసం 14 సార్లు కొన్ని నిర్ణయాలపై అధికారికంగా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ఆ నివేదిక పేర్కొంది. SIRతో పాటు ఓటర్ల చేర్పులు, తొలగింపులు, పునరుద్ధరణలు, ఫారం-6 మార్పులు వంటి అంశాలు ఈ అభ్యంతరాల్లో ఉన్నట్లు వెల్లడించింది. ఎన్నికల సంఘం మాత్రం భిన్నాభిప్రాయాలు సంస్థాగత నిర్ణయ ప్రక్రియలో భాగమేనని, గత ఏడాది తీసుకున్న తుది నిర్ణయాలు ఏకగ్రీవంగానే జరిగాయని తెలిపింది. ఇదే అంశంపై ప్రతిపక్ష పార్టీలు సీఈసీ రాజీనామాకు డిమాండ్‌ చేస్తూ నిరసనలు ముమ్మరం చేశాయి.

బహిరంగ పోరుగా మారిన వివాదం

ఈసీ వివాదం ఇప్పుడు రాజకీయ ప్రకటనల నుంచి వీధి నిరసనల వరకు విస్తరించింది. పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో SIR ప్రక్రియపై న్యాయపరమైన సవాళ్లు కూడా కొనసాగుతున్నాయి. మరోవైపు సీఈసీపై చర్యలకు డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష నేతలు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. సీఈసీపై వచ్చిన ఆరోపణలు, ఇద్దరు కమిషనర్ల అభ్యంతరాలు, ఎన్నికల సంఘం ఇచ్చిన వివరణ ఇప్పుడు మొత్తం వివాదానికి కేంద్రంగా మారాయి. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి చిరాగ్‌ పాస్వాన్‌ కూడా పేర్కొన్నారు.

 

#Congress #GyaneshKumar #CEC #CECResignation #ElectionCommission #ECI #CongressProtest #NationwideProtest #SIR #SpecialIntensiveRevision #VoterList #GauravGogoi #JantarMantar #ElectionControversy #ElectionNews